AP: నాడు అక్రమ అరెస్ట్‌.. నేడు ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం!

AP: నంద్యాలలో నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ వైసీపీపై విరుచుకుపడ్డారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 9 Sept 2026 8:57 PM IST
AP
X

AP: నాడు అక్రమ అరెస్ట్‌.. నేడు ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం!

AP: నంద్యాలలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై శాసనమండలి చీఫ్‌ విప్‌ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఐదు దశాబ్దాల పాటు మచ్చలేని ప్రజా జీవితాన్ని గడిపిన విజనరీ నేత చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే అప్పటి వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. నాడు అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబుకు నేడు ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం నేతృత్వం వహిస్తోందని అన్నారు.

నంద్యాలలో పార్టీ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో చంద్రబాబు బస చేసిన బస్సు తలుపులు అర్ధరాత్రి బాది నిద్రలేపి, ఎలాంటి కారణం లేకుండా అరెస్టు చేశారని అనురాధ మండిపడ్డారు. జగన్‌ ఆదేశాలతో పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని విమర్శించారు. అయితే చంద్రబాబు ప్రజలను సంయమనం పాటించాలని, న్యాయస్థానాలపై నమ్మకం ఉంచాలని సూచించడంతో ప్రజలు శాంతియుతంగా న్యాయపోరాటం చేశారని గుర్తుచేశారు.

చంద్రబాబు అరెస్టు సమయంలో నారా లోకేష్‌ తన పాదయాత్రను నిలిపివేసి కార్యకర్తలకు అండగా నిలిచారని, ఢిల్లీ స్థాయిలో న్యాయపోరాటం చేశారని తెలిపారు. భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంతో భువనేశ్వరి 96 నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించారని పేర్కొన్నారు.

53 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి విడుదలైన సమయంలో రాజమండ్రి నుంచి అమరావతి వరకు ప్రజలు 72 గంటల పాటు రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారని అనురాధ అన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రావడం వైసీపీ పాలనపై ప్రజల తిరస్కారానికి నిదర్శనమన్నారు.

వైసీపీ పాలన రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. కోర్టు తీర్పులతో చంద్రబాబుపై చేసిన ఆరోపణలు తేలిపోయాయని, ఇప్పటికైనా వైసీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా వైసీపీ నేతల తీరు మారలేదని విమర్శించారు. అంతిమంగా నిజమే గెలిచిందని, ప్రజా తీర్పు ముందు కుట్రలు, కక్ష సాధింపులు నిలబడవని పంచుమర్తి అనురాధ స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story