AP: డీఎస్సీపై వైసీపీది గోబెల్స్ ప్రచారం: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్!

AP: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ విజయవంతం కావడం చూసి ఓర్వలేక వైసీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మండిపడ్డారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 9 Sept 2026 8:51 PM IST
AP
X

AP: డీఎస్సీపై వైసీపీది గోబెల్స్ ప్రచారం: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్!

AP: మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండగా, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.

చంద్రబాబు తొలి సంతకంతో మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టారని, వైసీపీ నేతలు కోర్టుల్లో 200కు పైగా కేసులు వేసి అడ్డంకులు సృష్టించినప్పటికీ మంత్రి లోకేష్ పట్టుదలతో 148 రోజుల్లో 16,347 మందికి నియామక పత్రాలు అందేలా చేశారని పేర్కొన్నారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేకే జగన్, వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం దారుణమన్నారు. కుప్పం ప్రాంతానికి చెందిన మాజీ సైనికుడు చక్రపాణి రెడ్డి దాదాపు 20 ఏళ్లు సైన్యంలో సేవలందించి, టెట్, బీఎడ్ పూర్తి చేసి స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం పొందారని తెలిపారు. ఆయనపై సాక్షి మీడియా ప్రతినిధులు వేధింపులకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించిన శ్రీకాంత్.. దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుడిని అవమానించడం సిగ్గుచేటన్నారు.

డీఎస్సీ అభ్యర్థులు కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహించి వైసీపీ దుష్ప్రచారంపై నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. క్రీడా కోటాపై కూడా వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బ్రిడ్జ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మైండ్ స్పోర్ట్ అని వివరించారు. ఒకే అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు.

నారా లోకేష్ ఎదుగుదలను చూసి ఓర్వలేకే వైసీపీ కుట్రలు చేస్తోందని శ్రీకాంత్ ఆరోపించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా లోకేష్ వెనక్కి తగ్గకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. మెగా డీఎస్సీ ద్వారా నిజాయితీగా ఉద్యోగాలు సాధించిన పేద, మధ్యతరగతి యువతను కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇకనైనా నిరుద్యోగుల కష్టాలను అవమానించే రాజకీయాలు మానుకోవాలని జగన్, వైసీపీ నేతలకు సూచించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story