Amaravati: ఇంధన కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్!

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 26 April 2026 6:03 PM IST
Amaravati
X

Amaravati: ఇంధన కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ వార్నింగ్!

Amaravati: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాలపై వెంటనే స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై కమిషనర్ కన్నబాబు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, పెట్రోల్–డీజిల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు, అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన కొరత, కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న ‘నో స్టాక్’ బోర్డులు, ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై సమగ్రంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 6 గంటలకల్లా రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా పూర్తిచేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని, జిల్లాల వారీగా పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో అన్ని బంకులకు ఇంధన సరఫరా సాధారణ స్థితికి వస్తుందని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు.

ఇక బ్లాక్ మార్కెట్ వ్యవహారంపై కూడా సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. కొందరు డీజిల్, పెట్రోల్‌ను అక్రమంగా నిల్వచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు కోరగా, మంత్రి నాదెండ్ల మనోహర్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సివిల్ సప్లై కమిషనర్ కూడా బ్లాక్ మార్కెట్ నడిపించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. కేవలం రవాణా, సరఫరా వ్యవస్థలో తాత్కాలిక ఇబ్బందుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు. వచ్చే రెండు రోజుల్లో డ్రై అవుట్‌లు, ‘నో స్టాక్’ బోర్డులు పూర్తిగా తొలగిపోయి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో ప్రజల్లో నెలకొన్న ఆందోళన తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story