దక్షిణ కొరియా బాటలో మంత్రి లోకేష్... పెట్టుబడులే ప్రధాన లక్ష్యం..
Amaravati: మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన ఖరారు. జూలై 5 నుండి 11 వరకు సియోల్‌లో పర్యటన. ఎల్జీ, హ్యోసంగ్ ప్రతినిధులతో పెట్టుబడులపై కీలక చర్చలు.
దక్షిణ కొరియా బాటలో మంత్రి లోకేష్... పెట్టుబడులే ప్రధాన లక్ష్యం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు తీసుకురావడం, ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనకు సిద్ధమయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో ప్రభుత్వ స్థాయి సమావేశాలతో పాటు ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో కీలక చర్చలు జరగనున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది...
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ప్రారంభమయ్యే ఈ పర్యటనలో తొలి రోజు అక్కడి భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రవాసులతో నిర్వహించే ఇండియా డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాతి రోజుల్లో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్స్, ఆటోమొబైల్, సముద్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు జరగనున్నాయి. స్టార్టప్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
ఈ పర్యటనలో హ్యోసంగ్, సియోల్ సెమికండక్టర్స్, ఎల్జీ కెమ్ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థల ఉన్నతాధికారులతో సమావేశాలు జరగడం విశేషం. ముఖ్యంగా ఎల్జీ గ్రూప్ అనుబంధ సంస్థల ప్రతినిధులతో జరిగే సమావేశంలో పారిశ్రామిక విస్తరణ, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై చర్చించనున్నారు. అలాగే కొరియన్ మెరైన్ ఎక్విప్‌మెంట్ అసోసియేషన్, ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుపై చర్చలు సాగనున్నాయి.
అధికారిక స్థాయిలో కూడా ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉంది. దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాల ఉపమంత్రితో పాటు అంతర్జాతీయ వాణిజ్య, పెట్టుబడుల శాఖ ఉపమంత్రితో మంత్రి లోకేష్ సమావేశమై రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పారదర్శక విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరుల గురించి వివరించి మరిన్ని కంపెనీలను ఆహ్వానించనున్నారు.
ఇక పర్యటన చివరి రోజున నిర్వహించే రోడ్‌షోకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. 2026లో జరగనున్న సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు దక్షిణ కొరియా కంపెనీలను ఆహ్వానించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ప్రపంచ పారిశ్రామిక వర్గాలకు పరిచయం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో, ఈ పర్యటన ద్వారా ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్స్, గ్రీన్ టెక్నాలజీ, ఆటోమొబైల్, మెరైన్ రంగాల్లో కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
లోకేష్ దక్షిణ కొరియా పర్యటన కేవలం మర్యాదపూర్వక విదేశీ పర్యటన మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, అంతర్జాతీయ భాగస్వామ్యాల బలోపేతానికి కీలక అడుగుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి...




