Amaravati: ఆధునిక ఫ్యాషన్ షోతో ఆకట్టుకున్న ఎన్‌ఐడీ విద్యార్థులు చేనేత వారోత్సవాలు!
Amaravati: అమరావతి ఎన్‌ఐడీలో జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాలు వైభవంగా నిర్వహించారు.
Amaravati: ఆధునిక ఫ్యాషన్ షోతో ఆకట్టుకున్న ఎన్‌ఐడీ విద్యార్థులు చేనేత వారోత్సవాలు!
అమరావతి: భారతీయ చేనేత సంప్రదాయాన్ని కొత్త తరానికి చేరవేసి, చేనేత వస్త్రాల వినియోగాన్ని మరింత పెంపొందించడమే లక్ష్యంగా జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాలు అమరావతిలో వైభవంగా నిర్వహించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేనేతకు ఆధునిక డిజైన్లను జోడిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన ఫ్యాషన్ షో, డిజైన్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విజయవాడ వీవర్స్ సర్వీస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ అనస్ షా బి. మాట్లాడుతూ, 1905 స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతీయ చేనేతకు ఉన్న సుదీర్ఘ చరిత్ర, దేశ సాంస్కృతిక వారసత్వంలో నేతకారుల పాత్రను ప్రజలకు తెలియజేయడం, అసలైన చేనేత ఉత్పత్తులపై అవగాహన పెంచడం, ముఖ్యంగా యువతలో చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
చేనేత అనేది కేవలం వస్త్రం మాత్రమే కాకుండా భారతీయ కళా నైపుణ్యానికి ప్రతీక అని పేర్కొన్న ఆయన, సంప్రదాయ నేత కళను ఆధునిక ఫ్యాషన్‌తో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా ఎన్‌ఐడీ విద్యార్థులు రూపొందించిన వినూత్న డిజైన్లు, చేనేత ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకున్నాయి. చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, ప్రత్యక్ష నేత ప్రదర్శనలు, చేనేత క్విజ్‌లు, డిజైన్ పోటీలు, చీర కట్టుకునే పోటీలు వంటి కార్యక్రమాలు సందర్శకుల్లో విశేష ఆసక్తిని రేకెత్తించాయి.
కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయగా, విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు మరింత రంగు చేకూర్చాయి. భారతీయ చేనేత రంగంలోని సౌందర్యం, నైపుణ్యం, సృజనాత్మకత, సుస్థిరతను ప్రతిబింబించేలా కొత్త తరానికి చేనేతను పరిచయం చేయడం ద్వారా మార్కెట్ విస్తరణకు అవకాశం కలుగుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వీవర్స్ సర్వీస్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్. జ్ఞానశేఖరన్, ఎన్‌ఐడీ అసోసియేట్ సీనియర్ ఫ్యాకల్టీ అర్నాబ్ సేనాపతి, టెక్నికల్ సూపరింటెండెంట్ బిశ్వజిత్ దీయాసీ, టెక్స్‌టైల్స్ డిజైనర్ సమీర కుమార్ కర్ తదితరులు పాల్గొన్నారు. చేనేతను భావితరాలకు చేరవేసే ప్రయత్నంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.




