AP: రోగి భద్రతలో ఏపీ ఫస్ట్..అధికారులు, వైద్య సిబ్బందికి మంత్రి సత్యకుమార్‌ అభినందన!

AP: రోగి భద్రత, నాణ్యతా ప్రమాణాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానం. 86 స్కోరుతో ఏపీ మొదటి ర్యాంక్.. కేంద్రం వెల్లడి, వైద్య సిబ్బందికి మంత్రి సత్యకుమార్ అభినందనలు.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 18 Sept 2026 4:31 PM IST
AP
X

AP: రోగి భద్రతలో ఏపీ ఫస్ట్..అధికారులు, వైద్య సిబ్బందికి మంత్రి సత్యకుమార్‌ అభినందన!

AP: రోగి భద్రత, ఆసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆసుపత్రుల్లో రోగి భద్రతకు సంబంధించి నిర్వహించిన అంచనాల్లో ఆంధ్రప్రదేశ్ 86 స్కోరు సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఢిల్లీలో గురువారం జరిగిన ప్రపంచ రోగి భద్రత దినోత్సవ జాతీయ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు చికిత్స సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తీసుకుంటున్న చర్యలు, ఆసుపత్రుల్లో అమలు చేస్తున్న భద్రతా ప్రమాణాలు, నాణ్యతా విధానాలు తదితర అంశాల ఆధారంగా ఈ అంచనాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏపీ 86 స్కోరు సాధించగా.. మధ్యప్రదేశ్ 84.5, గుజరాత్ 83.5, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ 83, తమిళనాడు 82 స్కోర్లు సాధించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్యంగా పెట్టుకున్న 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ రోగి భద్రతకు సంబంధించిన అంచనాలను పూర్తి చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో 53 ఏరియా ఆసుపత్రులు, 9 జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. పేషెంట్ సేఫ్టీ సెల్ఫ్ అసెస్‌మెంట్ విధానంలో పరిశీలనలు నిర్వహించి.. జిల్లా స్థాయి క్వాలిటీ బృందాలు, రాష్ట్ర క్వాలిటీ యూనిట్ ద్వారా వివరాలను సమీక్షించారు. అనంతరం సమగ్ర నివేదికను నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌కు సమర్పించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అమలులోనూ రాష్ట్రం పురోగతి సాధించింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఎన్‌క్యూఏఎస్ సర్టిఫికేషన్ కవరేజ్ 65 శాతానికి చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వైద్య సేవల నాణ్యత, రోగి భద్రత, పరిశుభ్రత, రోగి కేంద్రిత సేవలు వంటి అంశాలకు ఈ ప్రమాణాల్లో ప్రాధాన్యం ఉంటుంది.

ప్రపంచ రోగి భద్రత దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, బోధనా ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలతో పాటు సేఫ్టీ ఆడిట్లను నిర్వహించాలని మంత్రి సత్యకుమార్‌ యాదవ్ ఇప్పటికే ఆదేశించారు. రోగికి చికిత్స అందించడం ఎంత ముఖ్యమో.. చికిత్స సమయంలో ఎలాంటి హాని జరగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం, మందుల భద్రత, చికిత్స అనంతరం నిరంతర పర్యవేక్షణ.. ఈ నాలుగు అంశాలు రోగి భద్రతలో కీలకమని మంత్రి పేర్కొన్నారు.

ఇక దీర్ఘకాలిక వ్యాధుల విషయంలోనూ ముందస్తు గుర్తింపు, నిరంతర పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్‌సీడీ 4.0 కార్యక్రమం కింద 18 ఏళ్లు పైబడిన 2.83 కోట్ల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గుర్తించిన వ్యాధులకు సంబంధించిన పరీక్షలు, మందులు, ఫాలోఅప్ సేవలను ‘సంజీవని’ డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రోగి భద్రతలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై మంత్రి సత్యకుమార్‌ యాదవ్ అధికారులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బందిని అభినందించారు. సాధించిన ఫలితంతో సంతృప్తి చెందకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత, భద్రత, రోగి కేంద్రిత సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ప్రజలకు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకం పెంచేలా ప్రతి ఆసుపత్రిలో ప్రమాణాలు పాటించాలని.. రోగికి సకాలంలో, సురక్షితంగా, నాణ్యమైన వైద్యం అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి స్పష్టం చేశారు. రోగి భద్రతను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా ఆసుపత్రి వ్యవస్థలో నిరంతర ప్రక్రియగా కొనసాగించడమే లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.