Amaravati: ఏపీ స్థానిక పోరు.. జెడ్పీ చైర్మన్ సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ!
Amaravati: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ జెడ్పీ చైర్మన్ స్థానాల పంపకాలపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల మధ్య కసరత్తు తుది దశకు చేరింది.
Amaravati: ఏపీ స్థానిక పోరు.. జెడ్పీ చైర్మన్ సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ!
Amaravati: ఆంధ్రప్రదేశ్లో జెడ్పీ చైర్మన్ స్థానాల పంపకాలపై కూటమి పార్టీల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఇవాళ కీలక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. జనసేనకు 6 లేదా 7 జెడ్పీ చైర్మన్ స్థానాలు కేటాయించే అంశం చర్చలో ఉన్నట్లు సమాచారం.
అయితే.. జనసేన మాత్రం 9 స్థానాలు కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అన్ని స్థానాలు కేటాయించడం సాధ్యం కాదని, ఆరు స్థానాలతో సరిపెట్టుకోవాలని టీడీపీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఇరు పార్టీల మధ్య తుది సర్దుబాటు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
జెడ్పీ చైర్మన్ పదవుల పంపకాల విషయంలో కూటమి అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యత దెబ్బతినకుండా, మూడు పార్టీల మధ్య సమన్వయం కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన కోరుతున్న స్థానాలు, టీడీపీ ప్రతిపాదిస్తున్న సంఖ్య మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే చర్చలు కీలకంగా మారనున్నాయి.
స్థానిక నాయకత్వానికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పంపకాల బాధ్యత
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పంపకాల విషయంలో స్థానిక నాయకత్వానికే నిర్ణయాధికారం ఇవ్వాలని కూటమి నేతలు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలం, అభ్యర్థుల విజయావకాశాలు, స్థానిక రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల సర్దుబాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే జెడ్పీ చైర్మన్ స్థానాల కేటాయింపుపై మాత్రం కూటమి అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విధానం ద్వారా స్థానికంగా తలెత్తే విభేదాలను తగ్గించడంతో పాటు, కూటమి పార్టీల మధ్య సమన్వయం సాధించాలని నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెబల్స్ ఉపసంహరణపై స్థానిక నేతలకు బాధ్యత
మరోవైపు, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయిన తర్వాత రెబల్ అభ్యర్థుల వ్యవహారం కూడా కీలకంగా మారనుంది. అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేసినవారు బరిలో కొనసాగితే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే రెబల్ అభ్యర్థులతో చర్చించి, వారి నామినేషన్ల ఉపసంహరణకు కృషి చేసే బాధ్యతను స్థానిక నాయకులే తీసుకోవాలని కూటమి పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. స్థానికంగా అసంతృప్తులను బుజ్జగించి, ఎన్నికల సమయానికి పార్టీల మధ్య విభేదాలు లేకుండా చూడాలన్నది నాయకత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది.
బీజేపీకి జెడ్పీ చైర్మన్ స్థానం దక్కేనా?
జెడ్పీ చైర్మన్ స్థానాల పంపకాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం కల్పించే అంశంపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీకి ఒక జెడ్పీ చైర్మన్ స్థానం కేటాయించాలా? లేక టీడీపీ, జనసేన మధ్యనే ప్రధానంగా సర్దుబాటు చేయాలా? అన్న దానిపై చర్చ కొనసాగుతున్నట్లు సమాచారం. మూడు పార్టీల ప్రయోజనాలను సమతుల్యం చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడం కూటమి నాయకత్వానికి సవాలుగా మారింది.
జెడ్పీ చైర్మన్ స్థానాల పంపకాలపై ఇవాళ జరిగే చర్చలతో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనసేనకు ఎన్ని స్థానాలు దక్కుతాయి? బీజేపీకి చైర్మన్ పదవి కేటాయిస్తారా? స్థానిక స్థాయిలో రెబల్ అభ్యర్థులను ఎలా సమన్వయం చేస్తారు? అన్న అంశాలపై కూటమి నేతల నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.




