Amaravati: రాబోయే 3 ఏళ్లలో 'ఉద్యోగం లేదు' అనే మాట వినపడదు..నీలాయపాలెం!
Amaravati: ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలు, ప్రైవేట్ యూనివర్సిటీ నిబంధనల సరళీకరణ & నూతన ఉద్యోగాల భర్తీపై ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్‌కుమార్ స్పష్టత.
Amaravati: రాబోయే 3 ఏళ్లలో 'ఉద్యోగం లేదు' అనే మాట వినపడదు..నీలాయపాలెం!
Amaravati: రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ తెలిపారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నత విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి, విద్యను వ్యాపారంగా మార్చిందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్యలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. విద్య అంటే కేవలం డిగ్రీలు పొందడం కాదని.. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించి ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌లో హబ్ అండ్ స్పోక్ మోడల్‌ను అమలు చేస్తున్నామని, స్కిల్ యూనివర్సిటీలను హబ్‌లుగా, ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, ఇంజినీరింగ్ కాలేజీలను స్పోక్స్‌గా అనుసంధానం చేస్తున్నామని వివరించారు.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు భూ నిబంధనలను సరళీకరించినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు-2026 ద్వారా విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతి, సీఆర్‌డీఏ పరిధిలో 50 ఎకరాల భూ పరిమితిని 10 ఎకరాలకు, ఇతర ప్రాంతాల్లో 15 ఎకరాలకు తగ్గించామని చెప్పారు.
సింగిల్ విండో, ఆన్‌లైన్ విధానంలో 60 రోజుల్లో ఫాస్ట్‌ట్రాక్ క్లియరెన్స్ ఇవ్వనున్నామని తెలిపారు. దీంతో రాబోయే రెండుమూడేళ్లలో రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చే అవకాశం ఉందన్నారు.
14 ఏళ్ల తర్వాత యూనివర్సిటీ ఫ్యాకల్టీ నియామకాలకు చర్యలు చేపట్టామని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు కలిపి 1,523 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు వచ్చాయని వెల్లడించారు. అధ్యాపకుల కొరతను అధిగమించి ఉన్నత విద్యలో నాణ్యత పెంచేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఇప్పటికే 22 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరో 10 వేల ఉద్యోగాల నియామకాలకు సన్నాహాలు జరుగుతున్నాయని విజయ్‌కుమార్ తెలిపారు. ఫేజ్-1లో 1,523 యూనివర్సిటీ పోస్టులు, ఫేజ్-2లో గ్రూప్-1లో 149 పోస్టులు, పోలీస్ శాఖలో 2,185 పోస్టులు, ఫేజ్-3లో గ్రూప్-2 తదితర పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. డీఎస్సీ ద్వారా మరో 2,995 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నామని వెల్లడించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదని విమర్శించారు. ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, ప్రొఫెసర్లు, డీఎస్పీలు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు వంటి పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ వ్యవహారాల్లో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ.. నియామక వ్యవస్థను రాజకీయ జోక్యానికి దూరంగా ఉంచి పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలో లక్షలాది అవకాశాలను యువత అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. సీడ్ఏపీ ద్వారా ఇప్పటికే సుమారు 2 నుంచి 3 లక్షల మందికి శిక్షణ అందించామని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్ రూపొందించి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తామన్నారు.
రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో ‘నాకు ఉద్యోగం లేదు’ అనే పరిస్థితి లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.




