ఏపీలో అబాట్ పెట్టుబడులకు ఆహ్వానం..
Amaravati: న్యూఢిల్లీలో అబాట్ ఇండియా ఎండీ ఇస్తేయాక్ అంజాధ్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో వైద్య పరికరాల తయారీ, జీసీసీ ఏర్పాటుపై చర్చ.
ఏపీలో అబాట్ పెట్టుబడులకు ఆహ్వానం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రముఖ గ్లోబల్ హెల్త్‌కేర్ సంస్థ అబాట్‌ను ఏపీలో తయారీ యూనిట్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే దిశగా పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు.
న్యూఢిల్లీలో అబాట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇస్తేయాక్ అంజాద్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో హెల్త్‌కేర్, మెడికల్ డివైసెస్, డయాగ్నస్టిక్స్, ఫార్మా రంగాలకు ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానపరమైన మద్దతు వంటి అంశాలను మంత్రి వివరించారు.
AMTZ లేదా EMCల్లో తయారీ యూనిట్
విశాఖపట్నం పరిధిలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (AMTZ) లేదా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో ఒకచోట వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. మెడికల్ డివైసెస్ తయారీకి అవసరమైన ఎకోసిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, సంబంధిత పరిశ్రమలకు అనుసంధానం కల్పించే అవకాశం రాష్ట్రంలో ఉందని వివరించారు.
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌పై ప్రతిపాదన
అదేవిధంగా నక్కపల్లిలో రాబోయే బల్క్ డ్రగ్ పార్క్‌లో జెనరిక్ మందుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అబాట్‌ను మంత్రి కోరారు. ఈ పార్క్‌లో అనుకూలమైన భూమి, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అవసరమైన యుటిలిటీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలమైన విధానపరమైన మద్దతు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
విశాఖలో GCC ఏర్పాటుకు ఆహ్వానం
విశాఖపట్నంలో అబాట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఐటీ, టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పెరుగుతున్న మౌలిక సదుపాయాలు విశాఖకు అదనపు అవకాశాలను కల్పిస్తున్నాయని వివరించారు. GCC ఏర్పాటుతో రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు నైపుణ్య ఉద్యోగాలు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీలో పెట్టుబడులపై అబాట్ ఆసక్తి
భారత్‌లో తమ సంస్థ కార్యకలాపాల గురించి అబాట్ ఇండియా ఎండీ ఇస్తేయాక్ అంజాద్ వివరించారు. దేశంలో అబాట్‌కు 400కు పైగా ఫార్మా బ్రాండ్లు, 12 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. గోవా, బద్ది (హిమాచల్ ప్రదేశ్), ఝగాడియా (గుజరాత్)లో తయారీ కేంద్రాలు, ముంబై, న్యూఢిల్లీలో కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం పోషకాహారం, ఫార్మా ఉత్పత్తుల రంగాల్లో స్థానికంగా పేరున్న తయారీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్నట్లు అంజాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.
అబాట్‌తో జరిగిన భేటీలో మెడికల్ డివైసెస్ తయారీ, జెనరిక్ ఔషధాల ఉత్పత్తి, పోషకాహార రంగం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ వంటి నాలుగు కీలక అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. అబాట్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో తదుపరి దశలో పెట్టుబడి అవకాశాలపై మరింత చర్చ జరిగే అవకాశం ఉంది.




