స్టార్టప్‌లు, టెక్నాలజీ రంగానికి మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యం..విశాఖలో జీసీసీ ఏర్పాటుపై లోకేష్ విజ్ఞప్తి

Amaravati: న్యూఢిల్లీలో మాస్టర్‌కార్డ్ వీపీ అభిషేక్ లాహిరితో మంత్రి నారా లోకేష్ భేటీ. విశాఖలో టెక్ సెంటర్, ఫిన్‌టెక్ రంగంలో భాగస్వామ్యంపై చర్చ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 Sept 2026 12:21 AM IST
Amaravati
X

స్టార్టప్‌లు, టెక్నాలజీ రంగానికి మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యం..విశాఖలో జీసీసీ ఏర్పాటుపై లోకేష్ విజ్ఞప్తి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ, స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ రంగాల అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ప్రముఖ గ్లోబల్ పేమెంట్స్, టెక్నాలజీ సంస్థ మాస్టర్‌కార్డ్ వైస్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ అభిషేక్ లాహిరితో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, టెక్నాలజీ విస్తరణకు ఉన్న అవకాశాలను మంత్రి లోకేష్ వివరించారు. విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న భూమి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఐటీ, జీసీసీ పాలసీలను ఉపయోగించుకుని మాస్టర్‌కార్డ్ ఆధ్వర్యంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ లేదా టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖను టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

అదే సమయంలో రాష్ట్రంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో మాస్టర్‌కార్డ్ ఫిన్‌టెక్ రంగంలో సలహాదారు సభ్యునిగా భాగస్వామ్యం కావాలని లోకేష్ ఆహ్వానించారు. స్టార్టప్‌లకు అవసరమైన మార్గదర్శకత్వం, పరిశ్రమ నిపుణుల సహకారం, మార్కెట్ అవకాశాలను అందించడంలో సంస్థ కీలకంగా వ్యవహరించగలదని తెలిపారు.

ఫైనాన్స్, బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కూడా మంత్రి కోరారు. సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడంతో పాటు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పీ4 కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

పర్యాటక రంగంలో మాస్టర్‌కార్డ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో కలిసి చేపట్టిన కార్యక్రమాలను కూడా మంత్రి ప్రస్తావించారు. రాజమండ్రి, కోనసీమ ప్రాంతాల్లో 'ప్రైస్‌లెస్ ఎక్స్‌పీరియన్స్' కార్యక్రమాన్ని అమలు చేసినందుకు సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే ఈ తరహా కార్యక్రమాలకు సహకరించిన తొలి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరిన్ని పర్యాటక, పర్యావరణ పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడానికి మాస్టర్‌కార్డ్ సహకరించాలని కోరారు.

మాస్టర్‌కార్డ్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ లాహిరి మాట్లాడుతూ.. భారత్‌లో పుణే, గురుగ్రామ్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, వడోదర కేంద్రాలుగా సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. దేశంలో సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. పుణేలో 6 వేల మంది టెక్నాలజిస్టులతో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న 'ప్రైస్‌లెస్' ప్లాట్‌ఫామ్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని దిండి, తిరుపతి, సూర్యలంక, అరకు, విశాఖ ప్రాంతాలను ప్రోత్సహించేందుకు ఏపీ టూరిజం అథారిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు అభిషేక్ లాహిరి తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా కార్యక్రమాలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.