ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ప్రతిపాదన..
Amaravati: న్యూఢిల్లీలో ఎస్‌ఏపీ సీనియర్ వీపీ లవ్‌నీష్ చనానాతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో డిజిటల్ గవర్నెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై చర్చ.
ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ప్రతిపాదన..
అమరావతి: న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వరుసగా టెక్నాలజీ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, క్లౌడ్, బిజినెస్ ఏఐ సంస్థ SAP సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లవ్‌నీష్ చనానాతో లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ గవర్నెన్స్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.
ఏపీలో SAP ఆధ్వర్యంలో డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. స్మార్ట్ గవర్నెన్స్, చిన్న-మధ్య తరహా సంస్థల డిజిటలైజేషన్, యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో ఈ సెంటర్ కీలకంగా పనిచేసేలా చూడాలని కోరారు. ప్రభుత్వ విభాగాల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగాన్ని పెంచడం ద్వారా సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు అవకాశాలు ఉంటాయని మంత్రి వివరించారు.
ముఖ్యంగా విద్యార్థులు, యువతలో SAP టెక్నాలజీలపై నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని లోకేష్ కోరారు. SAPకు సంబంధించిన స్కిల్ డెవలప్‌మెంట్, సర్టిఫికేషన్ కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్‌తో కలిసి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ, సర్టిఫికేషన్లు అందితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.
మరోవైపు SAP సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లవ్‌నీష్ చనానా మాట్లాడుతూ.. భారత్‌లో ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు SAP సాంకేతిక సేవలు అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ రంగంలో డిజిటల్ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతోందని తెలిపారు.
SAP Labs India ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఉన్న అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో ఒకటిగా ఉందని చనానా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా SAP రెండో అతిపెద్ద R&D హబ్‌గా భారత కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. గ్లోబల్ ప్రొడక్ట్స్, బిజినెస్ ఏఐ పరిష్కారాల అభివృద్ధి, విడుదలలో భారత R&D బృందాలు కీలకంగా పనిచేస్తున్నాయని వివరించారు.
ఇదే సమయంలో బెంగళూరులో కొత్తగా సుమారు 15 వేల సీట్ల సామర్థ్యంతో R&D, ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు SAP ప్రతినిధి తెలిపారు. పరిశోధన, ఆవిష్కరణలకు భారత్‌లో తమ సంస్థ మరింత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్, సర్టిఫికేషన్ కార్యక్రమాలపై పరిశీలన చేస్తామని SAP ప్రతినిధి హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ డిజిటల్ సేవలు, పరిశ్రమల డిజిటలైజేషన్, యువత నైపుణ్యాభివృద్ధి రంగాల్లో SAPతో భాగస్వామ్యానికి మార్గం సుగమం కానుంది.




