ఏపీలో కాంపొనెంట్స్ తయారీ పార్కుకు ప్రతిపాదన..

Amaravati: న్యూఢిల్లీలో వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో వివో కాంపొనెంట్స్ తయారీ పార్క్ ఏర్పాటుపై చర్చ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 Sept 2026 12:30 AM IST
Amaravati
X

ఏపీలో కాంపొనెంట్స్ తయారీ పార్కుకు ప్రతిపాదన..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివో మొబైల్ ఫోన్లకు అవసరమైన కాంపొనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి కోరారు.

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తిరుపతి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అక్కడ వివో మొబైల్స్‌కు సంబంధించిన కాంపొనెంట్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ ప్రతిపాదించారు. కేవలం మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్‌కే పరిమితం కాకుండా.. వాటికి అవసరమైన కాంపొనెంట్స్ తయారీ, సరఫరా వ్యవస్థను కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

వివో సరఫరాదారులు, అనుబంధ సంస్థలను ఏపీలోకి ఆకర్షించేలా ప్రత్యేకంగా కాంపొనెంట్స్ తయారీ పార్క్ అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. దీనివల్ల వివోకు అవసరమైన వివిధ విడిభాగాల తయారీతో పాటు స్థానికంగా కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే వివో, దాని అనుబంధ సంస్థలు, వెండర్లతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సప్లై చైన్ సమావేశం నిర్వహించాలని లోకేష్ ప్రతిపాదించారు. వివోకు ఇప్పటికే దేశంలో ఏర్పడిన సరఫరా వ్యవస్థను ఏపీకి విస్తరించేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని వివరించారు.

సమావేశంలో వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ సంస్థ దేశంలో కొనసాగిస్తున్న తయారీ కార్యకలాపాల గురించి వివరించారు. వివో ఇండియా ప్రతిఏటా 154.2 మిలియన్ యూనిట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని తెలిపారు. 2025 నాటికి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.

భారత్‌లో విక్రయించే వివో ఫోన్లలో 99 శాతానికి పైగా గ్రేటర్ నోయిడాలోనే తయారవుతున్నాయని అర్జిత్ సేన్ తెలిపారు. ఫోన్ల తయారీలో కీలకమైన మదర్‌బోర్డులు, బ్యాటరీలు, ఛార్జర్లు తదితర కాంపొనెంట్స్ తయారీ కూడా అక్కడే జరుగుతోందని వివరించారు. ఇందులో మదర్‌బోర్డుల తయారీతో పాటు 90 శాతానికి పైగా బ్యాటరీలు, ఛార్జర్ల తయారీ కూడా గ్రేటర్ నోయిడా కేంద్రంగానే జరుగుతోందని పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన కాంపొనెంట్స్ తయారీ పార్క్, సప్లై చైన్ విస్తరణ అంశాలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని అర్జిత్ సేన్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగానికి ఉన్న అవకాశాలను పరిశీలించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

తిరుపతి కేంద్రంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో వివో వంటి అంతర్జాతీయ సంస్థల సరఫరా వ్యవస్థను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా కాంపొనెంట్స్ తయారీ, వెండర్ యూనిట్లు, సప్లై చైన్ సంస్థలు రాష్ట్రంలోకి వస్తే పెట్టుబడులతో పాటు స్థానికంగా నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది..

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.