రాయలసీమకు జగన్ చేసిన ద్రోహం ఏమిటో ప్రజలకు తెలుసు మంత్రి నిమ్మల రామానాయుడు
Amaravati: రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాయలసీమకు జగన్ చేసిన ద్రోహం ఏమిటో ప్రజలకు తెలుసు మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి: రాయలసీమ ఇరిగేషన్‌పై మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా విమర్శించారు. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ఖర్చు, పూర్తి చేసిన పనులపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై సరైన అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
రాయలసీమకు ఏం చేశారో చెప్పాలి
2019లో రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాల్లో 49 స్థానాలను ప్రజలు వైఎస్సార్‌సీపీకి కట్టబెట్టారని మంత్రి గుర్తుచేశారు. అంతటి ఘన విజయాన్ని అందించిన రాయలసీమకు ఐదేళ్ల పాలనలో జగన్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న జగన్, తన హయాంలో వాటికి ఎన్ని నిధులు కేటాయించారు, ఎన్ని పనులు పూర్తి చేశారో ప్రజలకు వివరించాలని అన్నారు.
రాయలసీమ కరువు నివారణకు కీలకమైన ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాయలసీమకు జగన్ అన్యాయం చేశారని విమర్శించారు.
శ్రీశైలంలో నీటి లభ్యతపై అప్రమత్తత
శ్రీశైలం రిజర్వాయర్‌కు గత ఏడాది సుమారు 2,000 టీఎంసీల నీరు వచ్చినప్పటికీ, ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కేవలం 208 టీఎంసీల మేరకే నీరు వచ్చిందని మంత్రి తెలిపారు. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 66 శాతం మాత్రమేనని చెప్పారు. పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలతో పాటు కృష్ణా డెల్టా, చెన్నై తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందన్నారు.
తాగునీటి అవసరాలకే దాదాపు 90 నుంచి 100 టీఎంసీల నీరు అవసరమవుతుందని తెలిపారు. అందుకే శ్రీశైలం నుంచి రాయలసీమకు ప్రతిరోజూ 11,500 క్యూసెక్కుల నీటిని పంప్ చేస్తున్నామని చెప్పారు. తక్కువ వర్షపాతం నేపథ్యంలో తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాతే ఆరుతడి పంటలకు నీరు అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.
నీటి పొదుపుపై రైతులకు అవగాహన
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులు, ప్రజలకు మే నెల నుంచే అవగాహన కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గోదావరి డెల్టాలోని సుమారు 10.40 లక్షల ఎకరాలు మినహా మిగిలిన ప్రాంతాలకు అవసరమైన నీటిని 2027 జూలై వరకు భద్రపరచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
విద్యుత్ ఉత్పత్తిపై జగన్‌కు అవగాహన లేదు
తెలంగాణ శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తోందని జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదలయ్యే నీరు నాగార్జునసాగర్‌కు చేరుతుందన్న కనీస అవగాహన కూడా మాజీ ముఖ్యమంత్రికి లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
నాగార్జునసాగర్ కుడి కాలువకు తాగునీటి అవసరాల కోసం సుమారు 32 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు మరో 15 టీఎంసీలు అవసరమవుతాయని తెలిపారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అవసరాలకు దాదాపు 46 టీఎంసీల నీరు అవసరమవుతుందని చెప్పారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కారణంగా వచ్చే నీటిని రాష్ట్ర అవసరాలకు విఘాతం కలగకుండా చూడాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలశక్తి శాఖకు ఇప్పటికే లేఖలు రాశామని వెల్లడించారు.
శ్రీశైలం భద్రతపై కూటమి ప్రభుత్వ చర్యలు
శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ప్లంజ్ పూల్‌కు మరమ్మతులు చేయకపోతే ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించినప్పటికీ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.203 కోట్లు కేటాయించి పనులు చేపట్టామని చెప్పారు.
తుంగభద్రకు కొత్త గేట్లు
రాయలసీమకు జీవనాధారమైన తుంగభద్ర ప్రాజెక్టు భద్రతపై కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని నిమ్మల విమర్శించారు. తుంగభద్రపై ఆధారపడిన ఎల్ఎల్‌సీ, హెచ్ఎల్‌సీ, కేసీ కెనాల్ ప్రాంతాలకు నీటి భద్రత ఎంతో కీలకమని అన్నారు.
గేట్ల పరిస్థితిపై గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. 2024లో 19వ గేటు కొట్టుకుపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నీటి ప్రవాహం కొనసాగుతున్న సమయంలోనే గేటును ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం 33 గేట్లను కొత్తగా ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుతం తుంగభద్రలో 105 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి కల్పించామని తెలిపారు.
గోరుకల్లు, పోతిరెడ్డిపాడుకు ప్రాధాన్యత
పోతిరెడ్డిపాడు నుంచి వచ్చే నీటిని నిల్వ చేసుకునే గోరుకల్లు రిజర్వాయర్ భద్రంగా ఉంటేనే అవుకు, గండికోట, చిత్రావతి వంటి ప్రాజెక్టులకు నీరు అందుతుందని మంత్రి వివరించారు. గోరుకల్లు రిజర్వాయర్‌కు ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించినప్పటికీ గత ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోరుకల్లు మరమ్మతులకు రూ.59 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచి పనులు చేపట్టిందన్నారు.
హంద్రీ-నీవాపై భారీగా ఖర్చు
ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు కీలకమైన హంద్రీ-నీవా ప్రాజెక్టుపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏం చేసిందో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,860 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
గత ఏడాది హంద్రీ-నీవా ద్వారా రికార్డు స్థాయిలో 55 టీఎంసీల కృష్ణా జలాలను తీసుకెళ్లామని తెలిపారు. నీవా బ్రాంచ్ కెనాల్ పనులను చేపట్టి తిరుమల వరకు కృష్ణా జలాలను తీసుకెళ్లే లక్ష్యంతో రూ.1,300 కోట్ల పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
రాయలసీమకు నిధుల్లో భారీ వ్యత్యాసం
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ఇరిగేషన్‌కు సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో కేవలం రూ.2 వేల కోట్ల మేర మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు.
2024-26 మధ్య కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్‌కు రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తుండగా, అందులో సుమారు 50 శాతం నిధులను రాయలసీమకు కేటాయిస్తున్నామని చెప్పారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ సహా కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులే గత ఐదేళ్ల పాలనలో రాయలసీమకు మోసం, దగా తప్ప మరేమీ జరగలేదని చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. రాయలసీమకు గతంలో ఎన్నడూ లేనంత అన్యాయం జగన్ పాలనలో జరిగిందని ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.
ప్రాజెక్టులపై అవాస్తవ ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని జగన్‌కు సూచించారు. ప్రస్తుతం 11 సీట్లకు పరిమితమైన వైఎస్సార్‌సీపీ ఇదే విధంగా అసత్య ప్రచారం కొనసాగిస్తే భవిష్యత్తులో ఉన్న స్థానాలను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు....




