NTR Vaidya Seva: పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తున్న కూటమి సర్కారు!
NTR Vaidya Seva: ప్రైవేటు ఆసుపత్రుల బకాయిల చెల్లింపులను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం. రూ.1000 కోట్ల విడుదల ప్రక్రియ మొదలు.
NTR Vaidya Seva: పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తున్న కూటమి సర్కారు!
Dr. NTR Vaidya Seva: ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రుల బకాయిల చెల్లింపులను కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న చెల్లింపుల కారణంగా పలు ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపివేయాలని హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “ట్రై పార్టి బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్” విధానంలో రూ.1000 కోట్లను విడుదల చేసే ప్రక్రియ మొదలైంది.
*ప్రత్యేక వెబ్ పోర్టల్ ద్వారా పారదర్శక ప్రక్రియ*
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు “ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ – బిల్ డిస్కౌంటింగ్” పేరుతో ప్రత్యేక వెబ్ పోర్టల్ రూపొందించింది. ఈ పోర్టల్ ద్వారా ఆసుపత్రుల యాజమాన్యాలతో నేరుగా ఒప్పందాలు కుదురుస్తోంది. ఇప్పటివరకు 323 ఆసుపత్రుల యాజమాన్యాలు టీబీడీఏ విధానం కింద దరఖాస్తు చేసుకున్నాయి...
*25 ఆసుపత్రులకు రూ.62 కోట్ల చెల్లింపు*
ఒప్పందాలు పూర్తైన ఆసుపత్రులకు చెల్లింపుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి దశలో సుమారు 25 ఆసుపత్రులకు రూ.62 కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. ఈ వివరాలను అధికారులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు నివేదించారు. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలకు కొంత ఊరట లభించింది.
రూ.2044 కోట్ల బకాయిల పరిశీలన
ప్రస్తుతం రాష్ట్రంలోని 873 ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.2044 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.1000 కోట్లకు సంబంధించిన బిల్లుల పరిశీలన పూర్తయింది. టీబీడీఏ విధానంలో ఒప్పందాలు చేసుకున్న ఆసుపత్రుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బకాయిలు జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
*ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చెల్లింపులు*..
ఈ చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో ఏడాది వడ్డీని ముందుగానే మినహాయించి మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం నియంత్రణలో ఉండటంతో పాటు, ఆసుపత్రులకు త్వరితగతిన నిధులు అందుతున్నాయి...
*పోర్టల్‌లో పూర్తి వివరాలు అందుబాటులో*
ప్రత్యేక పోర్టల్‌లో బిల్లుల చెల్లింపు మొత్తం, వడ్డీ కింద మినహాయించిన మొత్తం, తుది చెల్లింపు వివరాలు అన్నీ స్పష్టంగా చూపిస్తున్నారు. లాగిన్, పాస్‌వర్డ్ వివరాలను ఆసుపత్రుల యాజమాన్యాలకు పంపించారు. ఒప్పంద పత్రాలపై ఆసుపత్రుల ప్రతినిధులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈఓ సంతకాలు చేస్తున్నారు...
*రూ.5556 కోట్ల చెల్లింపులు పూర్తి*..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్ ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు మొత్తం రూ.5556 కోట్ల చెల్లింపులు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన రూ.2403 కోట్ల బకాయిలను కూడా ఇందులో క్లియర్ చేసింది. అదనంగా మరో రూ.1000 కోట్లను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది..
*రూ.6900 కోట్ల వైద్య సేవలు ప్రజలకు*..
జూన్ 2024 నుంచి ఏప్రిల్ 5, 2026 వరకు రాష్ట్ర ప్రజలకు రూ.6900 కోట్ల విలువైన వైద్య సేవలు అందించబడ్డాయి. ఇందులో ఇప్పటికే రూ.3162 కోట్లను ఆసుపత్రులకు చెల్లించారు. ప్రజలకు వైద్య సేవలు ఎక్కడా ఆగిపోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.




