డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. ‘ఆపరేషన్ ట్రైడెంట్’తో అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు భారీ దెబ్బ
Dilip Kilaru: కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ ట్రైడెంట్'తో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ మూలాలు దెబ్బతిన్నాయని బీజేపీ ఏపీ మీడియా ఇన్‌చార్జ్ దిలీప్ కిలారు తెలిపారు.
డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. ‘ఆపరేషన్ ట్రైడెంట్’తో అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు భారీ దెబ్బ
Dilip Kilaru: అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ట్రైడెంట్’ కీలక విజయాన్ని సాధించిందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్‌చార్జ్ దిలీప్ కిలారు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. డ్రగ్స్ మాఫియా ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతో పాటు అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను నిర్మూలించడంలో ఈ ఆపరేషన్ కీలక ముందడుగని వెల్లడించారు.
38 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు
అక్టోబర్ 23న అస్సాం, మిజోరం, మణిపూర్ రాష్ట్రాల్లోని 38 ప్రాంతాల్లో భద్రతా, దర్యాప్తు సంస్థలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయని దిలీప్ కిలారు తెలిపారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల రవాణా వ్యవస్థలు, వాటికి ఆర్థిక సహకారం అందిస్తున్న నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ దాడుల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన హవాలా లావాదేవీలను గుర్తించడంతో పాటు 1,424 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినట్లు వివరించారు. రూ.17.82 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారని, 500 డిటోనేటర్లు, రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కేసులకు సంబంధించి 18 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
డ్రగ్స్ మాఫియా ఆర్థిక మూలాలే లక్ష్యం
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదని, దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు, యువత భవిష్యత్తుకు పెను ముప్పుగా మారుతోందని దిలీప్ కిలారు పేర్కొన్నారు. డ్రగ్స్ మాఫియాకు నిధులు సమకూర్చే హవాలా వ్యవస్థలను దెబ్బతీయడం ద్వారా నేర నెట్‌వర్క్‌లను బలహీనపరచవచ్చని తెలిపారు.
భారత్‌తో పాటు మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల మీదుగా సాగుతున్న మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోవడంలో ఇలాంటి సమన్వయ చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాటి వెనుక ఉన్న ఆర్థిక వ్యవస్థను గుర్తించి అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
2029 నాటికి డ్రగ్స్ నెట్‌వర్క్‌ల నిర్మూలన లక్ష్యం
2029 డిసెంబర్ 31 నాటికి దేశంలోని డ్రగ్స్ నెట్‌వర్క్‌లను నిర్మూలించాలన్న లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దిలీప్ కిలారు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, నార్కోటిక్స్ నిరోధక విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని పేర్కొన్నారు.
యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, అక్రమ సంపాదనకు అడ్డుకట్ట వేయడం, దేశ సరిహద్దుల భద్రతను పటిష్టం చేయడం వంటి అంశాల్లో ఆపరేషన్ ట్రైడెంట్ ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు. డ్రగ్స్ మాఫియా నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఆపరేషన్ ట్రైడెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు, నార్కోటిక్స్ నిరోధక విభాగాలు, అస్సాం, మిజోరం, మణిపూర్ పోలీసు బలగాలకు దిలీప్ కిలారు అభినందనలు తెలిపారు. దేశాన్ని మాదకద్రవ్యాల ముప్పు నుంచి రక్షించేందుకు భద్రతా సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.




