AP: బోడెన్సీ సరస్సులో ఏపీ పారా స్విమ్మర్ గణేష్ ప్రపంచ రికార్డు!

AP: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారా స్విమ్మర్, డీఎస్సీ విజేత బలగ గణేష్ మాస్టర్ బోడెన్సీ సరస్సును 5 గంటల 14 నిమిషాల్లో ఈది ప్రపంచ రికార్డు సృష్టించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 14 Sept 2026 10:33 PM IST
AP
X

AP: బోడెన్సీ సరస్సులో ఏపీ పారా స్విమ్మర్ గణేష్ ప్రపంచ రికార్డు!

AP: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారా స్విమ్మర్‌, డీఎస్సీ-2025 విజేత బలగ గణేష్ మాస్టర్‌ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్‌ వరకు విస్తరించిన బోడెన్సీ సరస్సులో సుమారు 12 కిలోమీటర్ల దూరాన్ని వెట్‌సూట్‌ లేకుండా ఈదుతూ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఈ అద్భుత ప్రదర్శనతో ఆంధ్రప్రదేశ్‌ పేరు అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి మార్మోగేలా చేశారు.

జర్మనీకి చెందిన స్వెన్ ఎకార్డ్‌ పేరిట ఉన్న 5 గంటల 33 నిమిషాల రికార్డును గణేష్ మాస్టర్‌ అధిగమించారు. బోడెన్సీ సరస్సులోని సుమారు 12 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 14 నిమిషాల 13 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. గత రికార్డుతో పోలిస్తే దాదాపు 19 నిమిషాల తేడాతో మెరుగైన సమయాన్ని నమోదు చేయడం గణేష్‌ మాస్టర్‌ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

ప్రతికూల పరిస్థితులు, సుదీర్ఘ ఈత, చల్లటి నీరు వంటి సవాళ్లను అధిగమిస్తూ వెట్‌సూట్‌ కూడా ఉపయోగించకుండా ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ప్రత్యేకతగా నిలిచింది. శారీరక పరిమితులు విజయానికి అడ్డంకి కాదని తన ప్రతిభ, పట్టుదలతో గణేష్ మాస్టర్‌ నిరూపించారు. సాధారణ స్విమ్మింగ్‌ పోటీలకే కాకుండా పారా స్విమ్మింగ్‌లోనూ ప్రపంచస్థాయి ప్రతిభను చాటుతూ యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు.

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ-2025లో గణేష్ మాస్టర్‌ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతూనే.. మరోవైపు క్రీడారంగంలో అంతర్జాతీయ రికార్డు సాధించడం విశేషంగా మారింది. విద్య, క్రీడలు రెండింటిలోనూ తన ప్రతిభను చాటిన గణేష్‌ మాస్టర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

గణేష్ మాస్టర్‌ సాధించిన ప్రపంచ రికార్డుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ అభినందనలు తెలిపారు. జర్మనీ నుంచి స్విట్జర్లాండ్‌ వరకు 12 కిలోమీటర్ల బోడెన్సీ సరస్సును వెట్‌సూట్‌ లేకుండా ఈదిన గణేష్‌ మాస్టర్‌ ఘనత అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పారా స్విమ్మర్‌గా అనితర సాధ్యమైన రికార్డు సృష్టించడం గర్వకారణమని పేర్కొన్నారు.

డీఎస్సీ-2025 ద్వారా ఉపాధ్యాయుడిగా ఎంపికైన గణేష్ మాస్టర్‌ పారా స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు సాధించడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ గర్వకారణమని లోకేష్‌ అన్నారు. కష్టాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని గణేష్ మాస్టర్‌ మరోసారి నిరూపించారని తెలిపారు.

ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు క్రీడారంగంలో తన విజయాలతో వారికి స్ఫూర్తినివ్వనున్న గణేష్ మాస్టర్‌.. భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.