Pawan Kalyan: జనసేనలో 'పవన్ కళ్యాణ్' సరికొత్త రాజకీయ ప్రయోగం
Pawan Kalyan: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతానికి అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం. 175 నియోజకవర్గాల పరిధిలో సమాచార సేకరణకు 28 మందితో ప్రత్యేక కమిటీల ఏర్పాటు.
Pawan Kalyan: జనసేనలో 'పవన్ కళ్యాణ్' సరికొత్త రాజకీయ ప్రయోగం
Pawan Kalyan: పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు గుర్తింపు కల్పించడం లక్ష్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా “పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల” ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాజకీయ పార్టీల్లో సాధారణంగా నాయకత్వం పైస్థాయి నిర్ణయాల ద్వారా ఏర్పడుతుంటే, జనసేన మాత్రం కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
*25 పార్లమెంట్ – 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కసరత్తు*
రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ఈ కమిటీలను నియమించారు. ప్రతి ప్రాంతంలో పార్టీ కోసం పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, నాయకుల వివరాలను సేకరించడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది.ఈ ప్రక్రియ ద్వారా పార్టీ కోసం నిజాయితీగా శ్రమించిన కార్యకర్తలు ఎవరు? ప్రజల్లో ప్రభావం చూపుతున్న నాయకులు ఎవరు? సంస్థాగత సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఎవరు? అనే అంశాలపై పూర్తి స్థాయి సమాచారం సేకరించనున్నారు.
*ప్రతి కమిటీలో 28 మంది సభ్యులు*
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నిర్మాణం ఇలా.. ఒక పరిశీలకుడు ముగ్గురు సీనియర్ నాయకులు, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న ముగ్గురు సాధకులు, వీరితో సమన్వయం చేసే 21 మంది కార్యకర్తలు. మొత్తం 28 మంది సభ్యులు కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా సమాచార సేకరణ చేపడతారు. మహిళలకు కూడా ఈ కమిటీల్లో తగిన ప్రాధాన్యం కల్పించడం విశేషం.
*‘సేనతో సేనాని’ కార్యక్రమం ఫలితమేనా..?*
ఇటీవల నిర్వహించిన “సేనతో సేనాని” కార్యక్రమం ద్వారా వేలాది మంది జనసైనికులు పార్టీ కోసం పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. వారిలో ప్రతిభ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఈ కమిటీల్లో భాగస్వామ్యం కల్పించారు.అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న కార్యకర్తలకు కూడా ఈ ప్రక్రియలో ప్రాధాన్యం లభించింది. పార్టీ ఆవిర్భావానికి ముందునుంచి, అలాగే 2009 నుంచి పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేస్తున్న నాయకుల అనుభవాన్ని కూడా వినియోగించుకునేలా కమిటీల రూపకల్పన జరిగింది.
*కమిటీలకు నాయకత్వ ఎంపిక అధికారాలు లేవు*
ఈ కమిటీలపై పార్టీ స్పష్టత ఇచ్చింది. కమిటీల్లో ఉన్న సభ్యులకు ఎటువంటి నాయకత్వ నియామకాలు చేసే అధికారం ఉండదు. వారు కేవలం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జనసైనికులు, సాధకులు, ఔత్సాహిక నాయకుల వివరాలను సేకరించి అధినేతకు నివేదిస్తారు. ఆ సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత, పార్టీ ముఖ్య నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం పార్టీ అధినేతే తీసుకుంటారు.
*దేశ రాజకీయాల్లో వినూత్న ప్రయోగం*
సాధారణంగా రాజకీయ పార్టీల్లో నాయకత్వం కుటుంబాలు, ఆర్థిక బలం లేదా రాజకీయ ప్రభావం ఆధారంగా నిర్ణయించబడుతుందనే విమర్శలు ఉంటాయి. అయితే జనసేన చేపడుతున్న ఈ విధానం క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తల పనితీరును ఆధారంగా చేసుకుని నాయకత్వాన్ని ఎంపిక చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రక్రియ విజయవంతమైతే భవిష్యత్‌లో ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఆదర్శంగా మారే అవకాశం ఉంది.
*జనసైనికులకు గుర్తింపు కల్పించడమే లక్ష్యం*
పార్టీ కోసం సంవత్సరాలుగా పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు గుర్తింపు కోసం ఎదురుచూస్తుంటారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వారిని గుర్తించి బాధ్యతలు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కేవలం కమిటీ నియామకం మాత్రమే కాకుండా, భవిష్యత్ జనసేన నాయకత్వాన్ని కేడర్ నుంచే తీర్చిదిద్దే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా భావిస్తున్నారు.
*భవిష్యత్ రాజకీయాలకు కొత్త దిశ*
దాదాపు దశాబ్దన్నర కాలంగా రూపకల్పన చేసిన ఆలోచనకు ఇప్పుడు కార్యరూపం దక్కిందని జనసేన నాయకత్వం భావిస్తోంది. క్షేత్రస్థాయిలో కష్టపడిన ప్రతి జనసైనికుడికి అవకాశాలు కల్పించడం, పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత పటిష్ఠంగా నిర్మించడం, యువత మరియు మహిళలకు నాయకత్వ అవకాశాలు ఇవ్వడం ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు.
ఈ కమిటీల ద్వారా సేకరించే సమాచారం ఆధారంగా భవిష్యత్‌లో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ నిర్మాణంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జనసేనలో కేడర్ నుంచే నాయకత్వాన్ని వెలికితీసే ఈ ప్రయోగం ఎంతవరకు విజయవంతమవుతుందో రానున్న రోజుల్లో తేలనుంది.




