Telangana : తెలంగాణలో జనసేన రాజకీయ యుద్ధానికి శ్రీకారం

Telangana : తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ ఇకపై ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 3 Jun 2026 8:40 AM IST
Telangana
X

Telangana : తెలంగాణలో జనసేన రాజకీయ యుద్ధానికి శ్రీకారం

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇకపై తెలంగాణలో కూడా జనసేన పూర్తి స్థాయిలో రాజకీయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల అవసరం వచ్చినప్పుడు మాత్రమే పార్టీని విస్తరిస్తామని గతంలో చెప్పిన పవన్, ఇప్పుడు పరిస్థితులు మారాయని, తెలంగాణలో జనసేన ఉనికి తప్పనిసరి అయిందని వెల్లడించారు..

*"ప్రతి సమస్యపై మాట్లాడతాం.. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం"*

తెలంగాణ ప్రజల సమస్యలపై బలమైన స్వరం వినిపిస్తామని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యమని చెప్పారు. తెలంగాణ తనకు పరాయి కాదని, "నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం" అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే రాజకీయ శక్తిగా జనసేనను తీర్చిదిద్దుతామని తెలిపారు..

*తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జనసేన వైఖరి*

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదని పవన్ మరోసారి స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరు పట్ల మాత్రమే తమకు అభ్యంతరం ఉందన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి, సభ్యులను బయటకు పంపించి రాష్ట్రాన్ని ప్రకటించడం తెలంగాణ ఉద్యమానికి తగిన గౌరవం కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన వేలాది మంది పోరాటయోధుల త్యాగాలకు మరింత గౌరవం ఇవ్వాల్సి ఉండేదని గుర్తు చేశారు..

*ప్రాంతీయ విద్వేషాలపై పవన్ హెచ్చరిక*

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే రాజకీయాలను పవన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం విడిపోయి పన్నెండేళ్లు దాటినా ఇప్పటికీ ఉద్యోగాలు, పరిశ్రమల సమస్యలకు ఆంధ్ర ప్రజలనే కారణంగా చూపడం సరైంది కాదన్నారు. నాయకుల తప్పులకు ప్రజలను బాధ్యులుగా చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రాంతీయ విద్వేషాలు చివరికి జాతీయ సమగ్రతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు..

*"తెలంగాణ మీ అయ్య జాగీరా?"*

తన తెలంగాణ పర్యటనలను అడ్డుకుంటామంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఏ ఒక్కరి జాగీరు కాదన్నారు. ఇతర పార్టీలు ఇతర రాష్ట్రాల్లో విస్తరించవచ్చని, అయితే జనసేన మాత్రం తెలంగాణలోకి రాకూడదనడం ద్వంద్వ వైఖరని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి ఎక్కడైనా పనిచేసే హక్కు ఉందన్నారు.

*అమిత్ షాపై వ్యాఖ్యల వివాదం*

కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తాను స్పందించానని పవన్ చెప్పారు. ఒక కేంద్ర మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తే దానికి సమాధానం చెప్పకూడదా అని ప్రశ్నించారు. దీనిని ప్రాంతీయ వివాదంగా మార్చి ప్రజల్లో చిచ్చుపెట్టడం సరైంది కాదన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

*చెరువు కబ్జా ఆరోపణలపై సవాల్*

తనపై వస్తున్న చెరువు కబ్జా ఆరోపణలకు కూడా పవన్ స్పందించారు. ప్రభుత్వం పూర్తిస్థాయిలో సర్వే చేయాలని, నిజంగా కబ్జా జరిగినట్లు తేలితే ఆ భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగిస్తానని ప్రకటించారు. తన వద్ద గోశాల మాత్రమే ఉందని, ఎలాంటి అక్రమాలు లేవని స్పష్టం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రైవేట్ ఆస్తుల్లోకి ప్రవేశించడం నేరమని హెచ్చరించారు..

*వామపక్షాలపై విమర్శలు*

ప్రాంతీయ విద్వేషాలను ప్రోత్సహించే కొందరు వామపక్ష మేధావులపై కూడా పవన్ విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు "ప్రపంచ కార్మికులారా ఏకం కండి" అని పిలుపునిచ్చిన వారు ఇప్పుడు ప్రాంతీయతను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇలాంటి ధోరణుల వల్లే కమ్యూనిజం దేశంలో బలహీనపడిందని వ్యాఖ్యానించారు. ప్రజా గాయకుడు గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తానన్నారు.

*ప్రాంతీయ విద్వేషాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరం*

ప్రజల మధ్య ప్రాంతాల పేరుతో చిచ్చుపెట్టడం దేశానికి ప్రమాదకరమని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య ద్వేషాన్ని పెంచే రాజకీయాలు చివరికి జాతీయ ఐక్యతను దెబ్బతీస్తాయని అన్నారు. దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని గుర్తు చేశారు. ప్రజలను విడదీసే రాజకీయాల కంటే అభివృద్ధి, ఉపాధి, యువత భవిష్యత్తు వంటి అంశాలపై చర్చ జరగాలని సూచించారు..

*తెలంగాణలో జనసేన కొత్త రాజకీయ ప్రయాణం*

తెలంగాణలో జనసేన సాధన ప్రారంభమైందని ప్రకటించిన పవన్ కళ్యాణ్, ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు చేయబోమన్నారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని, తెలంగాణ యువత ఆకాంక్షలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య స్నేహం, సహకారం పెరగాలని ఆకాంక్షిస్తూ, రెండు రాష్ట్రాలను కలిపే రహదారికి మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలని సూచించారు. అలాగే ప్రజా గాయకుడు గద్దర్ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగిస్తామని ప్రకటించారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ మీడియా సమావేశంతో తెలంగాణ రాజకీయాల్లో జనసేన కొత్త అధ్యాయానికి తెరలేపింది. "తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుంది" అనే పవన్ కళ్యాణ్ ప్రకటన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఎంత మేరకు బలపడుతుందనేది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story