సిద్ధాంతాలే పునాది.. సంస్థాగత నిర్మాణమే లక్ష్యం..జనసేనకు కొత్త దిశ చూపిన పవన్ కళ్యాణ్..

Amaravati: మంగళగిరిలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 27 Jun 2026 8:03 PM IST
Amaravati
X

సిద్ధాంతాలే పునాది.. సంస్థాగత నిర్మాణమే లక్ష్యం..జనసేనకు కొత్త దిశ చూపిన పవన్ కళ్యాణ్..

అమరావతి: జనసేన పార్టీని ఎన్నికల కోసం పనిచేసే రాజకీయ వేదికగా కాకుండా.. తరతరాల పాటు కొనసాగే సిద్ధాంతపరమైన ఉద్యమంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన పార్టీ నిర్మాణ సారథుల సమావేశంలో పార్టీ భవిష్యత్తు, నాయకత్వ నిర్మాణం, కుల రాజకీయాలు, యువత ఆకాంక్షలు, వైసీపీపై విమర్శలు.. ఇలా అనేక కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. జనసేన సంస్థాగత నిర్మాణంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన పవన్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అంటూ కార్యకర్తలకు దశ దిశ నిర్దేశం చేశారు..

*సిద్ధాంతాలే జనసేనకు బలం*

జనసేన పార్టీని కేవలం ఎన్నికల కోసం ఏర్పాటు చేయలేదని.. సిద్ధాంతాలను నమ్మే కార్యకర్తలతో బలమైన రాజకీయ వ్యవస్థను నిర్మించడమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. పుష్కర కాలంగా తనతో కలిసి ప్రయాణించిన కార్యకర్తలతోనే ఇప్పుడు పార్టీకి శాశ్వత పునాది వేస్తున్నామన్నారు. వ్యక్తులు కాదు.. భావజాలమే పార్టీని నిలబెడుతుందని స్పష్టం చేశారు.

*చిన్న కాలువ నుంచి నిత్య ప్రవాహంగా*

చిన్న కాలువలా ప్రారంభమైన జనసేన.. నేడు వాగు ప్రవాహంలా విస్తరించిందని పవన్ అన్నారు. ఇకపై అది నిరంతర ప్రవాహంలా కళకళలాడాలని ఆకాంక్షించారు. పార్టీ విస్తరణతో పాటు నాణ్యమైన నాయకత్వాన్ని కూడా తయారు చేయాల్సిన బాధ్యత అందరిదని చెప్పారు.

*క్యాడర్ నుంచే భావి నాయకత్వం*

జనసేనలో నాయకత్వం పై నుంచి రాదని.. కిందిస్థాయి కార్యకర్తల నుంచే తయారవుతుందని పవన్ స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి వివరాలను సేకరించి.. వారి సేవలు, ప్రజల్లో పని తీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. పూర్తి పారదర్శకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే నియామకాలు జరుగుతాయని వెల్లడించారు.

*యువతకు ఉచితాలు కాదు... భవిష్యత్తు కావాలి*

నేటి యువత ఉచితాల కోసం ఎదురుచూడడం లేదని... గౌరవప్రదమైన ఉద్యోగాలు, మెరుగైన భవిష్యత్తు కోరుకుంటోందని పవన్ అన్నారు. సంక్షేమ పథకాలకు జనసేన వ్యతిరేకం కాదని... కానీ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా మారితే అభివృద్ధి దెబ్బతింటుందని చెప్పారు. విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై కూడా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

*11 సీట్లు వచ్చినా మారని వైసీపీ*

ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా వైసీపీ నాయకుల భాషలో మార్పు రాలేదని పవన్ విమర్శించారు. వ్యక్తిగత దూషణలను రాజకీయంగా ఎదుర్కొంటామని.. కానీ జనసేన నాయకులు అంశాలపై బలంగా మాట్లాడాలని సూచించారు. ప్రతి విషయాన్నీ తానే స్పందించే వరకు ఎదురుచూడకుండా.. పార్టీ నాయకులంతా ప్రజల తరఫున గొంతెత్తాలని పిలుపునిచ్చారు.

కుల రాజకీయాలకు దూరంగా... ఐక్యతే లక్ష్యం

కులాన్ని రాజకీయ పెట్టుబడిగా ఎప్పటికీ ఉపయోగించబోనని పవన్ మరోసారి స్పష్టం చేశారు. కులాల మధ్య విభేదాలు సృష్టించడం రాష్ట్రానికి ప్రమాదకరమని హెచ్చరించారు. అన్ని కులాల ఆమోదంతోనే గొప్ప నాయకత్వం తయారవుతుందని చెప్పారు. కులాలను విడదీసే రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని జనసేన నాయకులకు సూచించారు.

*బీసీలు ఐక్యంగా ఉంటే రాజకీయ సమీకరణాలు మారతాయి*

బీసీలు జనాభాలో అధికంగా ఉన్నప్పటికీ.. ఓట్ల సమయంలో ఐక్యత చూపడం లేదని పవన్ వ్యాఖ్యానించారు. బీసీలు ఐక్యంగా ఉంటే అవకాశాల కోసం ఎవరినీ అడగాల్సిన అవసరం ఉండదన్నారు. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన నాయకత్వమే సామాజిక విజయమని చెప్పారు.

*కాపులను టార్గెట్ చేస్తున్న రాజకీయ కుట్ర..?*

కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రతికూలంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పవన్ ఆరోపించారు. వ్యక్తుల తప్పులను మొత్తం కులానికి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందే కుట్ర జరుగుతోందన్నారు. అలాంటి రాజకీయాలను ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.

*ప్రతి నాయకుడు స్పందించాలి*

జనసేనలో ప్రతి నాయకుడు ప్రతి అంశంపై బలంగా స్పందించాలని పవన్ సూచించారు. ఎదుటివారి విమర్శలకు సహేతుకంగా, అంశాల ఆధారంగా సమాధానం ఇవ్వాలని.. పార్టీ కేంద్ర కార్యాలయ సహకారంతో ప్రజల్లో పార్టీ భావజాలాన్ని బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

జనసేనను వ్యక్తుల చుట్టూ తిరిగే పార్టీగా కాకుండా... సిద్ధాంతాలపై నడిచే శాశ్వత రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. సంస్థాగత నిర్మాణం, భావి నాయకత్వం, కుల సమీకరణాలు, యువత ఆకాంక్షలు, రాజకీయ ప్రత్యర్థులపై వ్యూహం... ఇలా అనేక అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకంగా మారనున్నాయి...

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story