AP: పల్లె ప్రగతిలో సరికొత్త విప్లవం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

AP: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏపీలో గ్రామీణాభివృద్ధి ప్రగతి పరుగులు. పల్లెపండుగ రోడ్లు, పంట కుంటలు, మినీ గోకులాలతో మారిన పల్లెల రూపురేఖలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 16 Sept 2026 11:52 PM IST
AP
X

AP: పల్లె ప్రగతిలో సరికొత్త విప్లవం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

AP: గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది. పల్లెల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇదే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత రెండేళ్లలో రోడ్లు, సాగునీటి వసతులు, పశుసంవర్ధక మౌలిక సదుపాయాలు, ఉద్యాన పంటలు, పారిశుధ్యం తదితర రంగాల్లో పనులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

గ్రామసభలతో అభివృద్ధికి తొలి అడుగు

గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్న పనులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలను నిర్వహించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి స్థానిక అవసరాలను గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. గ్రామసభల్లో వచ్చిన తీర్మానాలను అభివృద్ధి పనులుగా మార్చేందుకు పల్లెపండుగ కార్యక్రమాన్ని రూపొందించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామంలోనే నిర్ణయాలు తీసుకుని వాటిని ప్రాధాన్యత క్రమంలో అమలు చేయడం ద్వారా గ్రామాభివృద్ధికి కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో పల్లెపండుగ, పల్లెపండుగ 2.0 కార్యక్రమాలు కీలకంగా మారాయి.

పల్లెపండుగతో వేల కిలోమీటర్ల రోడ్లు

గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాల మెరుగుదలకు రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. పల్లెపండుగ రెండు దశల్లో కలిపి సుమారు 9,600 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామాల్లోని అంతర్గత రహదారులు మెరుగుపడటంతో ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇక గ్రామాలను మండల కేంద్రాలతో, ఇతర ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించేలా సుమారు 10 వేల కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో అనేక రోడ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్లు, ప్రార్థనా స్థలాలకు ప్రజలు సులభంగా చేరుకునేలా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు.

పుణ్యక్షేత్రాలకు మెరుగైన రవాణా

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రహదారి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు కూడా పనులు చేపట్టారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గంలో రోడ్డు నిర్మాణం చేపట్టారు. శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు.

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, కోటప్పకొండ, ఐ.ఎస్‌. జగన్నాథపురం తదితర ప్రాంతాలకు వెళ్లే భక్తుల సౌకర్యం కోసం రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. వాడపల్లి ఏడువారాల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వంటి పలు క్షేత్రాలకు సాస్కీ వంటి పథకాల ద్వారా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు.

పల్లెపండుగ రెండు దశల్లో 100కు పైగా క్షేత్రాలకు రూ.120 కోట్లతో సుమారు 205 కిలోమీటర్ల మేర రహదారి పనులు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ప్రజల వినతులకు తక్షణ స్పందన

గ్రామసభల తీర్మానాలతో పాటు ప్రజల నుంచి నేరుగా వచ్చిన వినతుల ఆధారంగా కూడా కొన్ని రోడ్లను మంజూరు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని గజ్జలవారిపల్లి విద్యార్థులు పాఠశాలకు వెళ్లే రహదారి సమస్యను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేయగా స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొంది.

అలాగే ప్రపంచ కప్‌ గెలిచిన అంధుల మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ టి.సి. దీపిక తన గ్రామానికి రోడ్డు కావాలని కోరగా, ఆమె ఇంటికి రోడ్డు సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వం తెలిపింది. అల్లూరి జిల్లా లబ్బర్తి పంచాయతీకి చెందిన లాకే బాబురావు తన గ్రామానికి రోడ్డు కావాలని కోరగా వెంటనే మంజూరు చేసినట్లు వెల్లడించింది.

గిరిజన ప్రాంతాలకు ‘అడవితల్లి బాట’

మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని చేపట్టారు. డోలీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్న గిరిజన గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనులు సాగుతున్నాయి.

రెండు దశల్లో రూ.2,078 కోట్లతో సుమారు 2,310 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో వెయ్యి కిలోమీటర్లకు పైగా రోడ్లు పూర్తయ్యాయని పేర్కొంది. ప్రధానమంత్రి జన్‌మన్‌, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర కేంద్ర పథకాల నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ పనులు కొనసాగుతున్నాయి.

రైతుకు అండగా పంట కుంటలు

గ్రామీణాభివృద్ధి పనుల్లో వ్యవసాయానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం, భూగర్భ జలాలను పెంచడం ద్వారా రైతులకు సాగునీటి భద్రత కల్పించేందుకు పంట కుంటల నిర్మాణం చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.15 లక్షల పంట కుంటలు నిర్మించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా రాయలసీమలో ఈ కార్యక్రమం తర్వాత సుమారు 50 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగినట్లు వెల్లడించింది. నీటి లభ్యత పెరగడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన పంటల వైపు వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.

రెండు లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు

ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరులు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొంది.

పంట కుంటలు, పండ్ల తోటలు, ఇతర ఉపాధి హామీ పనులను సమన్వయం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.

పాడి రైతులకు మినీ గోకులాలు

పశుసంవర్ధక రంగంలోనూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. పాడి రైతులు తమ పశువులను సురక్షితంగా ఉంచుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 38 వేలకుపైగా మినీ గోకులాలు నిర్మించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

వేసవిలో పశువులకు తాగునీటి సమస్య రాకుండా సుమారు 15 వేల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. పశువులకు నీడ, నీరు అందుబాటులో ఉండటం ద్వారా పాడి రైతులకు ఉపశమనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

పారిశుధ్యానికి ‘మ్యాజిక్ డ్రెయిన్లు’

రోడ్లు, సాగునీటి వసతులతో పాటు గ్రామీణ పారిశుధ్యంపైనా దృష్టి పెట్టారు. గ్రామాల్లో మురుగునీటి నిర్వహణను మెరుగుపరిచేందుకు ‘మ్యాజిక్ డ్రెయిన్లు’ నిర్మిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 54 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది.

మురుగునీరు నిల్వ ఉండకుండా చేయడం ద్వారా దోమలు, దుర్వాసన సమస్యలను తగ్గించడంతో పాటు గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ఈ పనులు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు వంటి కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు.

పల్లెపండుగ 3.0కు రూట్‌మ్యాప్

పల్లెపండుగ, పల్లెపండుగ 2.0 ద్వారా చేపట్టిన పనులను కొనసాగిస్తూ పల్లెపండుగ 3.0కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైన అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది.

వీబీ-జీ రామ్‌జీ, సాస్కీ తదితర పథకాల ద్వారా వచ్చే నిధులను గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గం వేదికగా వీబీ-జీ రామ్‌జీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

గ్రామీణాభివృద్ధితో స్వయం సమృద్ధి

రోడ్లు, నీటి వనరులు, పండ్ల తోటలు, పశువుల కోసం మినీ గోకులాలు, పారిశుధ్య సదుపాయాలు వంటి పనులు ఒకదానితో ఒకటి అనుసంధానమైతే గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి నీరు, రైతుకు ఉపాధి, పశుపోషణకు మౌలిక వసతులు, విద్యార్థులకు రవాణా, ప్రజలకు ఆరోగ్య సేవలకు చేరువ వంటి అంశాలను కలిపి గ్రామాభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

రెండు దశల్లో చేపట్టిన పల్లెపండుగ కార్యక్రమాల తర్వాత ఇప్పుడు పల్లెపండుగ 3.0పై దృష్టి పెట్టడం ద్వారా గ్రామాల్లో మిగిలిన మౌలిక వసతుల లోటును పూడ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గ్రామసభల నుంచి మొదలైన అభివృద్ధి ప్రణాళికలు రోడ్లు, నీటి వనరులు, వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, పారిశుధ్యం వరకు విస్తరించడంతో పల్లెల్లో అభివృద్ధి పనులకు కొత్త ఊపునిచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.