Amaravati: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత పెంచాలి.. మంత్రి
Amaravati: వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల నాణ్యత పెంచి ప్రజల సంతృప్తి స్థాయిని 85% తీసుకెళ్లాలని ఆదేశించారు.
Amaravati: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత పెంచాలి.. మంత్రి
Amaravati: ప్రభుత్వ ఆసుపత్రులు అంటే పేద ప్రజలకు పెద్ద దిక్కు. అలాంటి ఆసుపత్రుల్లో సేవల నాణ్యతను మరింత పెంచి ప్రజల్లో సంతృప్తి స్థాయిని 85 శాతానికి తీసుకెళ్లాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రుల పనితీరు, వైద్య సిబ్బంది బాధ్యతలు, శానిటేషన్, కొత్త జోన్ల విధానం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, నియామకాల ప్రణాళిక వంటి ఎనిమిది కీలక అంశాలపై దాదాపు మూడు గంటల పాటు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వైద్య సేవల్లో ఇకపై సంఖ్యలకే కాకుండా నాణ్యతకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
*పనిచేసిన వారికే గుర్తింపు.. కొత్త అంచనా విధానం*
ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును ఓపీ, ఐపీ సేవలు, శస్త్రచికిత్సలు, పరీక్షల సంఖ్య ఆధారంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈ విధానంలో ఎక్కువ పనిచేసిన వారికీ, తక్కువ పనిచేసిన వారికీ ఒకే రకమైన మూల్యాంకనం జరుగుతోందని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే ఇకపై ప్రతి డాక్టర్, ప్రతి నర్స్, ప్రతి టెక్నీషియన్ రోజుకు ఎంతమందికి సేవలు అందించాలి, ఏడాదికి ఎంత లక్ష్యాన్ని చేరుకోవాలి అనే అంశాలను ముందుగానే నిర్ధారించి, వాటి ఆధారంగా పనితీరును అంచనా వేయాలని సూచించారు. దీంతో ఎవరు సమర్థంగా పనిచేస్తున్నారు, ఎక్కడ లోపాలున్నాయి అన్నది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
*ప్రతి నెల సమీక్ష.. నిర్లక్ష్యానికి చోటు లేదు*
ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు ఒకసారి చూసి వదిలేయకుండా ప్రతి నెలా సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. పనితీరు తక్కువగా ఉన్న ఆసుపత్రులు, వైద్య సిబ్బందిని గుర్తించి వెంటనే లోపాలు సరిదిద్దే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా పనిచేయాలంటే క్రమం తప్పని పర్యవేక్షణ తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు.
*శానిటేషన్‌పై రాజీ లేదు*
ఆసుపత్రుల్లో పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో కొత్త శానిటేషన్ ఏజెన్సీలు నియమించిన తర్వాత హాజరు నమోదు వంటి సాంకేతిక సమస్యల కారణంగా పారిశుధ్య సేవల్లో కొంత లోపం ఏర్పడిందని అధికారులు వివరించారు. దీంతో రోగులు, వారి కుటుంబ సభ్యుల్లో అసంతృప్తి పెరిగిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కారమైనందున పూర్తి స్థాయిలో శానిటేషన్ సిబ్బందిని విధుల్లో ఉంచి ప్రతి ఆసుపత్రిని పరిశుభ్రంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
*కొత్త జోన్ల విధానం.. ఆరోగ్యశాఖపై ప్రభావం*
రాష్ట్రంలో అమల్లోకి వస్తున్న కొత్త జోన్ల విధానాన్ని కూడా మంత్రి లోతుగా సమీక్షించారు. నాలుగు జోన్ల స్థానంలో ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్ల విధానం అమల్లోకి రావడంతో నియామకాలు, పదోన్నతులు, బదిలీలపై ప్రభావం పడనుంది. ఈ మార్పులు ప్రజారోగ్య వ్యవస్థకు ఇబ్బందులు కలగకుండా ఎలా అమలు చేయాలన్న దానిపై అధికారులు చర్చించారు. ముఖ్యంగా వైద్యుల కొరత రాకుండా అవసరమైన కేడర్లను రాష్ట్రస్థాయి లేదా మల్టీజోనల్ కేడర్లుగా పరిగణించాలని ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచాలని నిర్ణయించారు.
*వైద్యుల నియామకాలపై ముందస్తు ప్రణాళిక*
రాష్ట్రంలో గత రెండేళ్లలో 12 వేల మంది వరకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం జరిగిందని మంత్రి తెలిపారు. అయినప్పటికీ ఇంకా అనేక చోట్ల ఖాళీలు ఉన్నాయని గుర్తుచేశారు. వచ్చే మూడేళ్లలో అవసరమైన అన్ని పోస్టులను దశలవారీగా భర్తీ చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవల్లో ఎక్కడా ఇబ్బందులు రాకుండా ముందుగానే అవసరాలను అంచనా వేసి నియామకాలు చేపట్టాలని సూచించారు.
*ప్రజల వినతులకు 30 రోజుల్లోనే సమాధానం*
మంత్రి కార్యాలయానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు, వివిధ సంస్థల నుంచి వచ్చే వినతులను అధికారులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడం సరికాదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై మంత్రి కార్యాలయం నుంచి పంపిన ప్రతి అంశంపై గరిష్టంగా 30 రోజుల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు.
*వర్షాకాల వ్యాధులపై అప్రమత్తం*
వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. గత మూడు సంవత్సరాల కేసుల వివరాలను పరిశీలించి ఎక్కువగా ప్రభావితమవుతున్న జిల్లాలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని నివారణ చర్యలు వేగవంతం చేయాలని, జిల్లా వైద్యాధికారులు ప్రతి వారం పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.
*సంస్కరణలతో ప్రజా వైద్య సేవలకు కొత్త దిశ*
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల సంఖ్య పెంచడమే కాకుండా సేవల నాణ్యత, వైద్య సిబ్బంది జవాబుదారీతనం, పరిశుభ్రత, వేగవంతమైన పరిపాలన, సమయానికి నియామకాలు, వ్యాధుల నియంత్రణ వంటి అన్ని అంశాల్లో సమగ్ర మార్పులు తీసుకురావాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పనితీరు ఆధారిత మూల్యాంకనం, నెలవారీ సమీక్షలు, ప్రజల ఫిర్యాదులపై త్వరిత స్పందన వంటి నిర్ణయాలు అమలైతే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సంస్కరణలు ఆశించిన స్థాయిలో అమలైతే ప్రభుత్వ వైద్య సేవలు మరింత సమర్థవంతంగా, ప్రజలకు మరింత చేరువగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.




