న‌మో-నారా భేటీలో నవ్వుల సందడి.. ఆత్మీయతకు అద్దం పట్టిన సాయంత్రం

Hyderabad: చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీ సందడి. లోకేష్ ఫిట్‌నెస్‌పై మోదీ సరదా వ్యాఖ్యలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 11 May 2026 7:37 AM IST
Hyderabad
X

న‌మో-నారా భేటీలో నవ్వుల సందడి.. ఆత్మీయతకు అద్దం పట్టిన సాయంత్రం

Hyderabad: దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇద్దరూ దేశ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నాయకులు. సాధారణంగా అభివృద్ధి, పరిపాలన, రాజకీయ వ్యూహాలపైనే చర్చలు చేసే ఈ ఇద్దరు నేతలు.. ఈసారి మాత్రం ఆత్మీయత, సరదా సంభాషణలతో ప్రత్యేక క్షణాలను పంచుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చిన ప్రధాని మోదీ.. గంటకుపైగా అక్కడ గడిపి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొనడంతో సమావేశం మొత్తం నవ్వులు, సరదా వ్యాఖ్యలతో హుషారుగా సాగింది..

ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించినది ఒక ప్రత్యేక ఫోటో ఫ్రేమ్‌. ఏడాది క్రితం ఢిల్లీలో యువగళం కాఫీ టేబుల్ బుక్‌ను మోదీ ఆవిష్కరించిన సందర్భానికి సంబంధించిన ఆ ఫోటోను ప్రత్యేకంగా ఫ్రేమ్ చేసి ఉంచారు. దాన్ని చూసిన ప్రధాని ఆ రోజులను గుర్తు చేసుకుంటూ చిరునవ్వులు చిందించారు. యాదృచ్ఛికంగా అదే తేదీకి సమీపంలో తాను చంద్రబాబు ఇంటికి రావడం విశేషమని లోకేష్ గుర్తుచేయడంతో అక్కడ మరింత ఆత్మీయ వాతావరణం నెలకొంది.

రామమందిరంలో పూజలు.. ఎన్టీఆర్ జ్ఞాపకాలు

చంద్రబాబు నివాసంలోని రామమందిరాన్ని సందర్శించిన ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ఉన్న సీతారాముల పంచలోహ విగ్రహాల గురించి చంద్రబాబు వివరిస్తూ.. అవి దశాబ్దాల క్రితం స్వర్గీయ N. T. Rama Rao తమకు అందించారని తెలిపారు. ఆ జ్ఞాపకాలను ఆసక్తిగా విన్న ప్రధాని.. కుటుంబ ఆధ్యాత్మిక సంప్రదాయాలపై ప్రశంసలు కురిపించినట్లు సమాచారం.

*లోకేష్ ఫిట్నెస్‌పై మోదీ సరదా కామెంట్*

ఈ సమావేశంలో ఎక్కువగా నవ్వులు పూయించిన అంశం మంత్రి లోకేష్ ఫిట్నెస్‌. లోకేష్ ఇలా ఫిట్‌గా మారడానికి ప్రధాని మోదీనే స్ఫూర్తి అని చంద్రబాబు చెప్పడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. తొలిసారి మోదీని కలిసిన తర్వాతే డైట్‌, ఫిట్నెస్‌పై లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సీఎం వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రధాని.. “ఇకపై ఇంకా బరువు తగ్గొద్దు” అంటూ సరదాగా సూచించారు. వెంటనే స్పందించిన లోకేష్.. “మీరు పాటించే క్రమశిక్షణే నాకు స్ఫూర్తి.. ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాను” అని చెప్పారు.

దేశం కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రధాని మోదీ ఎనర్జీని చూస్తుంటే.. “25 ఏళ్ల ముగ్గురు యువకులు ఒకరిలా పనిచేస్తున్నట్టుంటుంది” అని లోకేష్ వ్యాఖ్యానించడంతో సమావేశంలో నవ్వులు వెల్లివిరిశాయి. 75 ఏళ్ల వయస్సులోనూ మోదీ పాటించే ఆరోగ్య నియమాలు, శారీరక ధృడత్వం తనకు ఆదర్శమని కూడా ఆయన పేర్కొన్నారు.

*“నాకు ఇద్దరు మెంటార్లు”*

సమావేశంలో అత్యంత భావోద్వేగంగా నిలిచిన వ్యాఖ్య మాత్రం లోకేష్ చేసిన “నాకు ఇద్దరు మెంటార్లు” అన్న మాట. దేశ స్థాయిలో మోదీ, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు తనకు మార్గదర్శకులని.. అభివృద్ధి, ప్రజా సేవ, పరిపాలనలో వారిద్దరినీ గురువులుగా భావిస్తానని లోకేష్ చెప్పారు. భావితరాల కోసం నిస్వార్థంగా పనిచేసే వారి స్పీడ్‌, అంకితభావం అందుకోవడమే తన లక్ష్యమన్నారు.

*మంగళగిరి చేనేతతో ప్రధానిని సత్కరించిన లోకేష్*

ప్రధాని మోదీని ప్రతిసారి కలిసినప్పుడు మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించడం లోకేష్ ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా ప్రత్యేక మంగళగిరి చేనేత శాలువాతో ప్రధానిని ఘనంగా సత్కరించారు. మంగళగిరి హ్యాండ్లూమ్ ప్రత్యేకత, చేనేత కళాకారుల ప్రతిభ గురించి ప్రధానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయం, కుటుంబ ఆత్మీయత, రాజకీయ అనుబంధం.. అన్నీ కలిసిన ఈ భేటీ “నమో-నారా బంధం”కి మరో గుర్తుండిపోయే అధ్యాయంగా నిలిచింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story