ప్రజా సేవకు ఆరోగ్యమే బలం.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ

Hyderabad: హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 11 May 2026 6:57 AM IST
Modi visits Pawan residence
X

ప్రజా సేవకు ఆరోగ్యమే బలం.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ

Hyderabad: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకొని ఆప్యాయంగా పరామర్శించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, సమాజానికి మరింత విస్తృతంగా సేవలు అందించాలంటే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని శ్రీ మోదీ గారు సూచించారు. “మీరు ఈ సమాజానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది... అందుకే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు” అంటూ పవన్ కళ్యాణ్ గారికి హితవు పలికారు..

*సైనస్ సర్జరీ నుంచి భుజ గాయాల వరకు*

ఆరోగ్య సమస్యలను వివరించిన పవన్ కళ్యాణ్

గత కొన్నేళ్ల పర్యటనల్లో దుమ్ము, ధూళి కారణంగా సైనస్ సమస్య తీవ్రరూపం దాల్చి ఇన్ఫెక్షన్ అయ్యిందని, కంటిపైనా ప్రభావం చూపడంతో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేయించుకున్నానని పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రికి వివరించారు. అలాగే భుజాల దగ్గర గతంలో తగిలిన గాయాల వల్ల రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ సమస్య ఉందని, స్పైనల్ కార్డ్‌కు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ ఓపికగా విన్న శ్రీ మోదీ గారు ఆరోగ్యంపై మరింత జాగ్రత్త తీసుకోవాలని సూచించారు..

*కుటుంబంతో మోదీ ఆప్యాయ సంభాషణలు*

పిల్లల ప్రతిభకు ముగ్ధుడైన ప్రధాని

పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులతో కూడా ప్రధాని ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. శ్రీమతి అన్నా కొణిదెల గారితో కొన్ని రష్యన్ పదాలు పలుకుతూ సరదాగా మాట్లాడారు. చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్వయంగా తయారు చేసిన వెల్కమ్, థాంక్యూ కార్డులను అందించగా వాటిని చూసి శ్రీ మోదీ గారు ముచ్చటపడ్డారు. సింగపూర్ అగ్నిప్రమాద ఘటనను ప్రస్తావిస్తూ “నీ గురించి మేమందరం చాలా ఆందోళన చెందాం బాబూ” అంటూ ప్రేమగా మాట్లాడారు...

*అకీరా చెప్పిన హిందీ కవితకు మోదీ ప్రశంసలు*

“కఠినమైన హిందీ నేర్చుకోవడం మామూలు విషయం కాదు”అకీరా నందన్ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ షూటింగ్‌లో శిక్షణ పొందుతున్నానని చెప్పగా, “ఇంట్లోనే ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉన్నారు.. నువ్వూ అదే దారిలో వెళ్తున్నావా?” అంటూ పవన్ కళ్యాణ్ వైపు చూసి ప్రధాని చమత్కరించారు. అనంతరం ప్రముఖ హిందీ కవి Ramdhari Singh Dinkar రాసిన కవితను అకీరా వినిపించగా, కఠినమైన హిందీ భాషను నేర్చుకోవడం సాధారణ విషయం కాదని ప్రశంసించారు..

*కుటుంబంతో 20 నిమిషాలపాటు ప్రత్యేక భేటీ*

“మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం”

ఆద్య కొణిదెల, పలీనా అంజనితో కూడా శ్రీ మోదీ గారు హిందీ, ఇంగ్లీష్‌లో సరదాగా మాట్లాడారు. “మళ్ళీ కలిసేటప్పటికి హిందీలో మాట్లాడాలి” అంటూ పలీనాతో సరదాగా వ్యాఖ్యానించారు. సుమారు 20 నిమిషాలపాటు కొనసాగిన ఈ ఆప్యాయ భేటీ అనంతరం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మా ఇంటికి వచ్చి చూపించిన ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేం” అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు....

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story