అక్వాన్ తుఫాన్‌.. విద్యుత్ శాఖ అప్రమత్తం.. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలు

Gottipati Ravikumar: అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్పెషల్ సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 17 Nov 2026 6:43 PM IST
Gottipati Ravikumar
X

అక్వాన్ తుఫాన్‌.. విద్యుత్ శాఖ అప్రమత్తం.. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు ముందస్తు చర్యలు

Gottipati Ravikumar: అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. ఈ నెల 19, 20 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు.

తుఫాన్ పరిస్థితులు, విద్యుత్ సరఫరా వ్యవస్థ సన్నద్ధతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల భద్రత, అత్యవసర మరమ్మతుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.

గతంలో అర్నబ్, మురసు తుఫాన్లను విద్యుత్ శాఖ సమర్థంగా ఎదుర్కొన్న తరహాలోనే అక్వాన్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉండటంతో ముందస్తు అప్రమత్తత అవసరమని స్పష్టం చేశారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన పక్షంలో ఆలస్యం చేయకుండా వెంటనే పునరుద్ధరించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మరమ్మతులకు అవసరమైన వాహనాలు, పరికరాలు, ఇతర సామగ్రిని ముందుగానే సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలు వేగంగా చేపట్టేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. జిల్లాల వారీగా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సమస్యలు తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

మరోవైపు భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్ పరికరాలు, స్తంభాలను తాకరాదని ప్రజలకు సూచనలు ఇవ్వాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు అవసరమైన హెచ్చరికలు జారీ చేయాలని స్పష్టం చేశారు.

తుఫాన్ సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా వ్యవస్థను సిద్ధంగా ఉంచడంతోపాటు, ఏదైనా అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.