Puttaparthi: పుట్టపర్తి నుంచి ఎగరనున్న యుద్ధ విమానాలు.. ఏపీ దశ మార్చే 'మల్టీ బిలియన్' ప్రాజెక్ట్!
Puttaparthi: ఆంధ్రప్రదేశ్‌లో రక్షణ రంగ విప్లవం. పుట్టపర్తిలో డిఆర్డిఓ ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం.
Puttaparthi: పుట్టపర్తి నుంచి ఎగరనున్న యుద్ధ విమానాలు.. ఏపీ దశ మార్చే 'మల్టీ బిలియన్' ప్రాజెక్ట్!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ల తర్వాత ఇప్పుడు రక్షణ రంగంలో కూడా భారీ అడుగులు వేయబోతోంది. పుట్టపర్తిని కేంద్రంగా చేసుకుని డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగంలో దేశంలోనే కీలక హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ, ఫ్లైట్ టెస్టింగ్ మరియు ఏరోస్పేస్ పరిశోధన కేంద్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది.
*ఏఐ వీడియోతో ఆసక్తి పెంచిన లోకేష్*
ఈ ప్రాజెక్టుపై మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. “మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా?” అంటూ చేసిన పోస్టు అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. వీడియోలో అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు, భారీ రన్‌వేలు, భవిష్యత్ తరహా ఏరోస్పేస్ కేంద్రాలు, హైటెక్ తయారీ యూనిట్లు కనిపించాయి..
ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాకుండా... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ దిశను సూచించే సంకేతంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యువతలో కూడా ఈ వీడియోపై భారీ స్పందన కనిపిస్తోంది. “పుట్టపర్తి నుంచి ఫైటర్ జెట్లు ఎగరనున్నాయా?” అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది....
*మే 15న భూమి పూజ*
డిఆర్డిఓ ఏరోస్పేస్ సెంటర్ ప్రాజెక్టుకు మే 15న భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఎందుకంటే ఇది సాధారణ పరిశ్రమ కాదు. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక ప్రాజెక్టుగా దీన్ని చూస్తున్నారు. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది...
*ఐదవ తరం స్టెల్త్ విమానాల ప్రత్యేకత ఏమిటి?*
స్టెల్త్ యుద్ధ విమానాలు అంటే శత్రు రాడార్లకు సులభంగా కనిపించకుండా రూపొందించే అత్యాధునిక ఫైటర్ జెట్లు. ఇవి తక్కువ శబ్దంతో, అధునాతన సెన్సార్లతో, అత్యంత వేగంతో పనిచేస్తాయి. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా వంటి కొద్దిమంది దేశాలకే ఈ టెక్నాలజీ ఉంది.
భారత్ కూడా స్వదేశీ టెక్నాలజీతో ఐదవ తరం యుద్ధ విమానాల తయారీలో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో పుట్టపర్తి ప్రాజెక్టు కీలక కేంద్రంగా మారబోతోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు..
*600 ఎకరాల్లో భారీ ప్రాజెక్టు*
ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే డిఆర్డిఓకు 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్, ప్రొడక్షన్ యూనిట్లు, పరిశోధనా కేంద్రాలు, శాస్త్రవేత్తల నివాస ప్రాంతాలు నిర్మించనున్నారు.
అదనంగా అనుబంధ పరిశ్రమల కోసం మరో 400 ఎకరాలను కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. అంటే మొత్తం వెయ్యి ఎకరాల పరిధిలో భారీ డిఫెన్స్ ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.
*లక్ష కోట్ల పెట్టుబడుల అంచనా*
ఈ ప్రాజెక్టు చుట్టూ అనేక ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, మెటల్ ఫాబ్రికేషన్, రాడార్ సిస్టమ్స్, డ్రోన్లు, ఏవియానిక్స్ రంగాలకు చెందిన అనుబంధ పరిశ్రమలు ఇక్కడ స్థాపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు...దీంతో మొత్తం మీద లక్ష కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యక్షంగా వేలాది ఉద్యోగాలు, పరోక్షంగా లక్షలాది ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని భావిస్తున్నారు.
*యువతకు భారీ అవకాశాలు*
ఈ ప్రాజెక్టుతో ఇంజినీరింగ్, డిప్లొమా, ఐటీఐ, టెక్నికల్ విద్యార్థులకు పెద్దఎత్తున అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి డిమాండ్ పెరగనుంది.
అలాగే రక్షణ రంగానికి సంబంధించిన స్టార్టప్‌లు కూడా ఏపీ వైపు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో కొత్త టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
*బెంగళూరుకు ప్రత్యామ్నాయంగా ఏపీ?*
ఇప్పటివరకు దేశంలో ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగానికి బెంగళూరు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఆ తరహాలోనే పుట్టపర్తిని కూడా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలుస్తోంది.పుట్టపర్తి ప్రాంతంలో ఇప్పటికే ఎయిర్ స్ట్రిప్, మంచి రహదారి కనెక్టివిటీ, ప్రశాంత వాతావరణం ఉండటం ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా మారింది. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయి డిఫెన్స్ కారిడార్‌గా ఈ ప్రాంతం ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
*చంద్రబాబు ఫోకస్ ఇదేనా?*
ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కాలంగా హైటెక్ పరిశ్రమలు, భవిష్యత్ టెక్నాలజీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన అనుభవంతో ఇప్పుడు ఏపీలో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఏరోస్పేస్ రంగాలను ప్రోత్సహిస్తున్నారు.
ఇప్పుడు డిఆర్డిఓ ప్రాజెక్టు కూడా అదే విజన్‌లో భాగంగా కనిపిస్తోంది. రాష్ట్రానికి పెద్ద పరిశ్రమలు తీసుకురావడం మాత్రమే కాకుండా, యువతకు ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
*జాతీయ స్థాయిలో ఏపీకి కొత్త గుర్తింపు*
పుట్టపర్తిలో డిఆర్డిఓ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే.. ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు వ్యవసాయం, ఐటీ, పోర్టులు, ఔషధ రంగాల్లో గుర్తింపు ఉన్న రాష్ట్రం.. ఇకపై రక్షణ రంగంలో కూడా కీలక రాష్ట్రంగా ఎదగవచ్చని అంచనా వేస్తున్నారు...దేశ భద్రతకు అవసరమైన అత్యాధునిక యుద్ధ సాంకేతికత తయారీలో ఏపీ భాగస్వామ్యం అవుతుండటం రాష్ట్రానికి ప్రతిష్టాత్మక అంశంగా మారుతోంది. ఇప్పుడు అందరి చూపు మే 15న జరగబోయే భూమి పూజ కార్యక్రమంపైనే ఉంది.
Guess what’s taking off from Puttaparthi on 15th May? pic.twitter.com/qSnAN7tEVX
— Lokesh Nara (@naralokesh) May 12, 2026




