రాయలసీమకు కొత్త రూపం.. ఉద్యాన హబ్‌తో గ్లోబల్ ఫ్రూట్ బౌల్..
Amaravati: అక్టోబర్ 2న మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ హబ్ ప్రారంభం. 10 జిల్లాల్లో 201 క్లస్టర్లు, రూ.లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సీఎం సమీక్ష.
రాయలసీమకు కొత్త రూపం.. ఉద్యాన హబ్‌తో గ్లోబల్ ఫ్రూట్ బౌల్..
అమరావతి: కరవు, వర్షాభావంతో వెనుకబడిన రాయలసీమను ఉద్యాన పంటల సాగుతో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాయలసీమను ప్రపంచ స్థాయి ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ హబ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు.
రాయలసీమలోని ఉద్యాన పంటల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు.. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాను కలుపుకుని రాయలసీమ పరిధిలోని 10 జిల్లాల్లో 201 హార్టీకల్చర్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొత్తం ప్రాజెక్టులో సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ప్రభుత్వం రూ.40 వేల కోట్లు, ప్రైవేట్ రంగం రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు.
రాయలసీమలో ఉద్యాన హబ్ ఏర్పాటుపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేవలం పంటల సాగుతోనే ఆగకుండా.. రైతు నుంచి మార్కెట్ వరకు పూర్తి వ్యవస్థను అనుసంధానం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పంటలు పండించడం, వాటిని నిల్వ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, బ్రాండింగ్, మార్కెటింగ్, చివరకు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే వరకు ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.
కరవు సీమ నుంచి ఉద్యాన సీమగా..
గతంలో రాయలసీమ అంటే కరవు, వర్షాభావం, సాగునీటి కొరత గుర్తుకు వచ్చేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులను మార్చే దిశగా అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. సూక్ష్మ సేద్యం, ఫామ్ పాండ్లు, చెక్‌డ్యామ్‌లు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.
హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్నామని సీఎం తెలిపారు. హంద్రీనీవా కాలువ ద్వారా సుమారు 660 కిలోమీటర్ల మేర కుప్పం వరకు నీటిని తీసుకెళ్లగలిగామని పేర్కొన్నారు. సాగునీటి వసతులు మెరుగుపడుతున్న నేపథ్యంలో సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా.. అధిక ఆదాయం వచ్చే ఉద్యాన పంటల వైపు రైతులను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు.
రాయలసీమలో ఇప్పటికే పలు ప్రాంతాలు పండ్ల తోటల సాగుకు ప్రసిద్ధి చెందాయి. మామిడి, టమాటా, అరటి, ద్రాక్ష, దానిమ్మ, చీనీ వంటి పంటలకు అనుకూల వాతావరణం ఉన్న ప్రాంతాలను గుర్తించి క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
201 క్లస్టర్లు.. రైతు నుంచి మార్కెట్ వరకు
హార్టీకల్చర్ హబ్‌లో భాగంగా 201 క్లస్టర్లలో ఉద్యాన పంటలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మార్కెటింగ్ వ్యవస్థలను అనుసంధానం చేయాలని సీఎం సూచించారు. ప్రతి క్లస్టర్‌లో స్థానిక వాతావరణం, నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్ ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది.
రైతు ఉత్పత్తిదారుల సంస్థలు.. అంటే ఎఫ్‌పీఓలను మరింత బలోపేతం చేయాలని సీఎం చెప్పారు. డ్వాక్రా సంఘాల తరహాలో రైతులు సంఘటితంగా ఏర్పడి తమ ఉత్పత్తులను సమష్టిగా మార్కెట్ చేసుకునే విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. రైతులు విడివిడిగా మార్కెట్‌పై ఆధారపడకుండా.. ఉత్పత్తి నుంచి విక్రయం వరకు తమకంటూ ఒక సామూహిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నది ఈ విధానంలో కీలకం.
ప్రతి క్లస్టర్‌లో కొంతమంది రైతులను చాంపియన్ ఫార్మర్లుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. కొత్త పంటల సాగు, ఆధునిక సాంకేతికత, నీటి వినియోగం, పంటల నాణ్యత, మార్కెటింగ్ వంటి అంశాల్లో రైతులకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. విజయవంతమైన రైతుల అనుభవాలను ఇతర రైతులకు చేరేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
రూ.లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యం
రాయలసీమ హార్టీకల్చర్ హబ్ ద్వారా వచ్చే ఐదారు సంవత్సరాల్లో ప్రాంతాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు. ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ రంగాన్ని పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. మొత్తం రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఉద్యాన రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు, నిల్వ కేంద్రాలు, మార్కెటింగ్ వ్యవస్థలు, ఇతర అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.
కియా నుంచి ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టు వరకు పరిశ్రమల ఏర్పాటుతో రాయలసీమలో పారిశ్రామిక మార్పు ప్రారంభమైందని సీఎం పేర్కొన్నారు. ఇప్పుడు ఉద్యాన రంగాన్ని కూడా ఆర్థికాభివృద్ధికి మరో కీలక ఇంజిన్‌గా మార్చాలని ఆకాంక్షించారు. వ్యవసాయంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా, కోల్డ్ చైన్, ఎగుమతులు వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
అక్టోబర్ 2న పండుగ వాతావరణంలో కార్యక్రమం
గాంధీ జయంతి రోజున హార్టీకల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టడం సంతోషకరమని సీఎం అన్నారు. మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఉద్యాన ఉత్పత్తులను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే స్థాయిలో ఈ హబ్‌ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
201 క్లస్టర్లలోని రైతులను కూడా వర్చువల్‌గా కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 3 వేలకుపైగా రైతు సేవా కేంద్రాల్లో క్లస్టర్ స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వర్క్‌షాప్‌లు, ట్రాక్టర్ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యాన హబ్ ఆవిర్భావాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని తెలిపారు.
ఉద్యాన పంటల సాగు ద్వారా ఇప్పటికే ప్రయోజనం పొందుతున్న రైతుల అనుభవాలను ప్రజలకు తెలియజేయాలని సీఎం సూచించారు. కొత్త పంటలతో రైతుల ఆదాయం ఎలా పెరిగింది.. జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు వచ్చింది.. వంటి అంశాలను ప్రజలకు వివరించాలని చెప్పారు.
ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక
మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ పంటల సాగుపైనా సీఎం సమీక్షించారు. వర్షపాతం, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్, వినియోగం, ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పంటల ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
శనగ, మినుము, పెసర, కంది, రాగులు, మొక్కజొన్న, జొన్నలు, ఉల్లి తదితర పంటల సాగు, కొనుగోళ్లు, కనీస మద్దతు ధరలపై కేంద్రంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ప్రతి ఎకరాన్నీ సాధ్యమైనంత వరకు సాగులోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు.
వ్యవసాయ శాఖలో ఏఐ ఆధారిత విశ్లేషణ వ్యవస్థను ఉపయోగించి ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేస్తే రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం ఉంటుందో గుర్తించాలని సూచించారు. ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధర రావాలి.. మరోవైపు వినియోగదారులపై అధిక ధరల భారం పడకూడదన్న సమతుల్యతను పాటించాలని సీఎం చెప్పారు.
ధరలు, ద్రవ్యోల్బణంపై వారానికోసారి సమీక్ష
పప్పు దినుసులు, చిరుధాన్యాలు సహా 14 రకాల పంటల ధరలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అధికం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇకపై ప్రతి వారం ద్రవ్యోల్బణంపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం తెలిపారు.
ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచాలని సూచించారు. వంటనూనె వినియోగాన్ని పరిమితం చేసుకునేలా ప్రచారం నిర్వహించాలని, రాగి, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యాల వినియోగాన్ని పెంచేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు.
వర్షాలు, పంటల సాగు పరిస్థితులపై నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, మార్కాపురం, శ్రీసత్యసాయి, అనంతపురం, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా హాజరయ్యారు.
రాయలసీమలో సాగునీటి వసతులు, ఉద్యాన పంటల సామర్థ్యం, ప్రైవేట్ పెట్టుబడులు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే హార్టీకల్చర్ హబ్ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. కరవు సీమగా ఉన్న రాయలసీమను రైతు ఆదాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించి కొత్త ఆర్థిక కేంద్రంగా మార్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం..




