Amaravati: అమరావతిపై 32 పరుగుల తేడాతో రాయలసీమ ఘన విజయం!

Amaravati: మంగళగిరి వేదికగా జరిగిన డబ్ల్యూఏపీఎల్ కీలక పోరులో అమరావతి ఈ ఛాంపియన్స్‌పై 32 పరుగుల తేడాతో గెలిచి రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 25 Sept 2026 10:39 PM IST
Amaravati
X

Amaravati: అమరావతిపై 32 పరుగుల తేడాతో రాయలసీమ ఘన విజయం!

అమరావతి: మంగళగిరి( ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం)రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు డబ్ల్యూఏపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. అమరావతి ఈ ఛాంపియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్స్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాయలసీమ జట్టు ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

టాస్ గెలిచిన రాయలసీమ జెన్ స్టార్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రాయలసీమ బ్యాటర్లలో ఈ. పద్మజ 29 బంతుల్లో 61 పరుగులతో చెలరేగారు. ఆమె ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. సేతు సాయి 26 బంతుల్లో 31 పరుగులు చేయగా, 4 ఫోర్లు బాదారు. వాసవి 23 బంతుల్లో 29 పరుగులు సాధించి 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో ఆకట్టుకున్నారు.అమరావతి ఈ ఛాంపియన్స్ బౌలర్లలో దేవిక 2 వికెట్లు పడగొట్టగా, సాయి పూజిత, జోషి చెరో వికెట్ సాధించారు.

173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు రాయలసీమ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. అమరావతి బ్యాటర్లలో దీక్ష కాట్రగడ్డ 25 బంతుల్లో 42 పరుగులు చేసి 4 ఫోర్లు, 2 సిక్సులతో రాణించారు. కాండ్రేగుల దేవిక 26 బంతుల్లో 39 పరుగులు చేసి 2 ఫోర్లు, 3 సిక్సులు బాదారు. అనూష 18 బంతుల్లో 26 పరుగులు సాధించారు. రాయలసీమ బౌలర్లలో వాసవి 4 వికెట్లతో అమరావతి బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. ఈ. పద్మజ, బి. అనూష చెరో 2 వికెట్లు పడగొట్టగా, ఏ. శిరీష, వి. సేతు సాయి తలా 1 వికెట్ సాధించారు. బ్యాటింగ్‌లో 61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో పాటు బౌలింగ్‌లోనూ వికెట్ సాధించిన ఈ. పద్మజను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

ఈ విజయంతో రాయలసీమ జెన్ స్టార్స్ ఫైనల్‌కు అర్హత సాధించింది. డబ్ల్యూఏపీఎల్ ఫైనల్లో రాయలసీమ జెన్ స్టార్స్ – గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్లు ఈ నెల 27న తలపడనున్నాయి. దీంతో డబ్ల్యూఏపీఎల్ టైటిల్ కోసం హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.