Amaravati: ఏపీలో రూ.428 కోట్లతో 8 పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి పనులు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.428 కోట్లతో 8 ప్రధాన ప్రాజెక్టులు.
Amaravati: ఏపీలో రూ.428 కోట్లతో 8 పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి పనులు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు రూ.428 కోట్లతో చేపట్టిన ఎనిమిది ప్రధాన పర్యాటక ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యవేక్షణ, అధికారులతో సమీక్షల ద్వారా పనులను త్వరగా పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు.
గోదావరి తీరానికి కొత్త అందాలు
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద రూ.94.44 కోట్లతో రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల్లో పర్యాటక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. చారిత్రక హేవలాక్ వంతెనపై నడక మార్గం, పుష్కర్ ఘాట్ అభివృద్ధి, కడియం నర్సరీలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయ పరిసరాల అభివృద్ధి, శెట్టిపేట వద్ద పార్కు, రెస్టారెంట్ వంటి పనులు చేపడుతున్నారు. గోదావరి కెనాల్‌లో బోటింగ్ సదుపాయాలు కూడా పర్యాటకులను ఆకర్షించనున్నాయి.
గండికోటకు అంతర్జాతీయ స్థాయి హంగులు
కడప జిల్లాలోని చారిత్రక గండికోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.77.91 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. వ్యూపాయింట్లు, హెరిటేజ్ వాక్, బోటింగ్ పాయింట్, పార్కింగ్ ప్రాంగణాలు, రహదారులు, ఓపెన్ ఎయిర్ థియేటర్, పర్యాటక సమాచార కేంద్రం వంటి సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు.
సూర్యలంక బీచ్‌కు ప్రత్యేక ఆకర్షణ
బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు రూ.97.52 కోట్లతో పనులు చేపట్టారు. బీచ్ ముఖద్వారం, షాపింగ్ స్ట్రీట్, యాంఫీ థియేటర్, విజిటర్ ఎక్స్‌పీరియన్స్ జోన్, వసతి సదుపాయాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి సాహస పర్యాటక కార్యకలాపాలతో తీర ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పుణ్యక్షేత్రాల్లో మెరుగైన సదుపాయాలు
సింహాచలం క్షేత్రంలో రూ.54.04 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేశారు. అన్నవరం దేవస్థానంలో రూ.25.32 కోట్లతో అన్నదానం భవనం, క్యూ కాంప్లెక్స్, ఇతర సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. అహోబిలంలో రూ.24.96 కోట్లతో మ్యూజియం, సన్నిధి వీధి సుందరీకరణ, పార్కింగ్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి సదుపాయాలు కల్పించారు.
బౌద్ధ పర్యాటకానికి ప్రాధాన్యం
నాగార్జునసాగర్ బౌద్ధ సర్క్యూట్ అభివృద్ధికి రూ.25 కోట్లతో పనులు చేపట్టారు. ధ్యాన మందిరం, స్పిరిచువల్ సెంటర్, పార్కు, రెస్టారెంట్ వంటి సదుపాయాలు బౌద్ధ వారసత్వాన్ని సందర్శకులకు పరిచయం చేయనున్నాయి.
లంబసింగి, బొర్రా గుహలకు ఆధునిక హంగులు
లంబసింగిలో పర్యావరణహిత గ్లాంపింగ్ కాటేజీలు, అంతర్గత రహదారులు, విద్యుత్ సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. బొర్రా గుహల అభివృద్ధికి రూ.29.87 కోట్లతో 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, లేజర్ లైటింగ్, కాఫీ టేస్టింగ్ సెంటర్లు, ఇతర పర్యాటక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
పెట్టుబడులు, ఉపాధికి కొత్త అవకాశాలు
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా, నూతన పర్యాటక పాలసీ, సీ ప్లేన్ సేవలు, క్రూయిజ్ టూరిజం, క్యారవాన్ టూరిజం, హోమ్‌స్టేలు, డిజిటల్ గైడ్ సదుపాయాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యాటక ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలకు ఊతం లభించే అవకాశం ఉంది.
మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత గుర్తింపు లభించనుంది.




