దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ.. ఏపీ వైద్యరంగం సరికొత్త రికార్డు
Amaravati: దేశంలోనే మొట్టమొదటి టెలి-రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన నారాయణ మరియు జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు అభినందించారు.
దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ.. ఏపీ వైద్యరంగం సరికొత్త రికార్డు
Amaravati: టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు మరింత సులభంగా అందించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోనే తొలిసారి టెలి-రోబోటిక్ సర్జరీ నిర్వహించిన నారాయణ మెడికల్ కాలేజీ-ఆస్పత్రులు, జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ-ఆస్పత్రుల యాజమాన్యాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో నారాయణ మెడికల్ కాలేజీ-ఆస్పత్రులు, జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ-ఆస్పత్రుల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ వినూత్న వైద్య సేవల వివరాలను తెలియజేశారు.
*వందల కిలోమీటర్ల దూరం నుంచి శస్త్రచికిత్స*
నెల్లూరు నుంచి రాజమహేంద్రవరానికి వైద్య సేవలు. టెలి-రోబోటిక్ సర్జరీ ద్వారా నెల్లూరులోని నారాయణ ఆస్పత్రిలో ఉన్న రోగికి రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆస్పత్రి వైద్యులు రోబో సాయంతో శస్త్రచికిత్స నిర్వహించారు.
అలాగే జీఎస్ఎల్ ఆస్పత్రిలో ఉన్న మరో రోగికి నారాయణ ఆస్పత్రి వైద్యులు దూరం నుంచే సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విధంగా రెండు ఆస్పత్రులు పరస్పరం సహకరించి అత్యాధునిక వైద్య సేవలను అందించాయి.
*దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ*
రెండు రోజుల్లో నాలుగు విజయవంతమైన ఆపరేషన్లు. దేశంలోనే తొలిసారి ఈ తరహా టెలి-రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్లు ఆస్పత్రుల ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
కేవలం రెండు రోజుల వ్యవధిలో నాలుగు సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర వైద్యరంగానికి గర్వకారణమని అన్నారు.
*భవిష్యత్ వైద్యసేవలకు కొత్త దిశ*
ఎక్కడి నుంచైనా స్పెషలిస్టుల సేవలు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఎక్కడి నుంచైనా శస్త్రచికిత్స చేయగలిగే ఈ సాంకేతికత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.
టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోగులకు కూడా అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
*రాష్ట్రానికి గర్వకారణం*
వైద్యరంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం నారాయణ, జీఎస్ఎల్ ఆస్పత్రులు చేసిన ఈ ప్రయోగం వైద్యరంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని సీఎం తెలిపారు.
దూరాన్ని అడ్డంకిగా కాకుండా సాంకేతికతను వేదికగా మార్చి వైద్య సేవలు అందించడం భవిష్యత్తులో ఆరోగ్య రంగాన్ని పూర్తిగా మార్చేస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి వినూత్న ప్రయోగాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు.




