Amaravati: స్వర్ణాంధ్ర @2047కు డేటా ఆధారిత పాలన..రెండేళ్లలో APSDPS కీలక అడుగులు!

Amaravati: 2047 నాటికి AP ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా APSDPS ద్వారా డేటా ఆధారిత పాలన, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 Aug 2026 4:27 PM IST
Amaravati
X

Amaravati: స్వర్ణాంధ్ర @2047కు డేటా ఆధారిత పాలన..రెండేళ్లలో APSDPS కీలక అడుగులు!

Amaravati: 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన ‘స్వర్ణాంధ్ర @2047’ విజన్‌ను కేవలం దీర్ఘకాలిక లక్ష్యంగా కాకుండా, క్షేత్రస్థాయిలో అమలు చేయగల కార్యాచరణ ప్రణాళికగా మార్చడంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ–APSDPS కీలక భూమిక పోషిస్తోంది.

2047 లక్ష్యాలకు పునాది

2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చడంతో పాటు, ఏటా 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్థిరమైన వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి నిర్దేశించిన పది సూత్రాలను ఆధారంగా చేసుకుని ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో APSDPS పనిచేస్తోంది.

కెపాసిటీ బిల్డింగ్, ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని స్టేట్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్–SIT వంటి విభాగాల సమన్వయంతో విధాన నిర్ణయాలను రోజువారీ పరిపాలనతో అనుసంధానిస్తోంది.

ఉద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధి

పరిపాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు IIM అహ్మదాబాద్, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ భాగస్వామ్యంతో ‘AP నాలెడ్జ్ సొసైటీ అండ్ కెపాసిటీ బిల్డింగ్ పాలసీ–2025’ కింద iGOT కర్మయోగి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 8.2 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమ పరిధిలోకి వచ్చారు. 1.85 కోట్ల ఎన్‌రోల్‌మెంట్లలో 1.52 కోట్లకు పైగా కోర్సులు పూర్తి చేయడంతో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

పాఠశాల విద్యా శాఖ 58.09 లక్షల కోర్సుల పూర్తి ద్వారా ముందంజలో ఉండగా, పంచాయతీరాజ్ 14.10 లక్షలు, పోలీస్ శాఖ 13.27 లక్షలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ 10.63 లక్షలు, ప్రజా రవాణా సంస్థ 4.38 లక్షల కోర్సులు పూర్తి చేశాయి.

గుడ్ గవర్నెన్స్‌కు గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్

అత్యుత్తమ పరిపాలనా విధానాలను రాష్ట్రంలో సంస్థాగతం చేసేందుకు అమరావతిలో ‘గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్–GIGG’ ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

హార్వర్డ్ కెన్నెడీ స్కూల్, ఆక్స్‌ఫర్డ్ బ్లావత్నిక్ స్కూల్, లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రమాణాలను ఆదర్శంగా తీసుకుని ఈ సంస్థను అభివృద్ధి చేయనున్నారు. ప్రయోగాత్మక విధానాలు, డేటా ఆధారిత పరిష్కారాల కోసం ‘ఆంధ్ర గవర్నెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్–AGIL’ కూడా ఇందులో భాగం కానుంది.

175 నియోజకవర్గాల్లో డేటా ఆధారిత ప్రణాళిక

రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు–CVAPUs ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి ప్రణాళికలకు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.

స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన పనిచేసే ఈ యూనిట్లలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు తదితరులతో కలిపి తొమ్మిది మంది సభ్యులు ఉంటారు. ప్రతి నియోజకవర్గానికి ఒక శిక్షణ పొందిన యువ నిపుణుడిని నియమించి, లైవ్ డాష్‌బోర్డుల ద్వారా 600కు పైగా అభివృద్ధి సూచికలను పర్యవేక్షిస్తున్నారు.

మొదటిసారిగా ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక నియోజకవర్గ కార్యాలయాలు అందుబాటులోకి రావడం కూడా పరిపాలనలో కీలక మార్పుగా ప్రభుత్వం పేర్కొంటోంది. P4 జీరో పావర్టీ కార్యక్రమం, బంగారు కుటుంబాల గుర్తింపు, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను ఈ కార్యాలయాలు పర్యవేక్షిస్తున్నాయి.

28 జిల్లాలపై ఒకేసారి సమీక్ష

రాష్ట్రంలో పరిపాలనా సమీక్షలను మరింత ఆధార సహితంగా నిర్వహించేందుకు క్లోజ్డ్-లూప్ రివ్యూ మెకానిజాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. స్వర్ణాంధ్ర పోర్టల్‌లోని కీలక పనితీరు సూచికలు, RTGS ద్వారా 45 ప్రభుత్వ ప్రచారాలపై ప్రజల అభిప్రాయాలు, PGRSలో నమోదైన సమస్యల పరిష్కార వివరాలను సమన్వయం చేస్తున్నారు.

ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి 28 జిల్లాల సమీక్షలను ఏకకాలంలో నిర్వహించే విధానాన్ని అమలు చేస్తున్నారు. కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రస్తావించే సమస్యలను కేంద్రీకృత రివ్యూ ట్రాకర్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందే సంబంధిత శాఖలు ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్’ సమర్పించే విధానం ద్వారా నిర్ణయాల అమలులో జవాబుదారీతనాన్ని పెంచుతున్నారు.

జనాభా, ఆర్థిక వ్యూహాలకు ప్రాధాన్యం

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక, ఆర్థిక రంగాల్లోనూ దీర్ఘకాలిక విధానాలను రూపొందిస్తున్నారు. జనాభా నిర్వహణ విధానం–2026లో భాగంగా ‘పిల్లలే సంపద’ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించి మాతృత్వ, సంజీవని, శక్తి, క్షేమ, నైపుణ్యం అనే ఐదు ప్రధాన స్తంభాలపై దృష్టి సారిస్తున్నారు.

ఆర్థిక రంగంలో తిరుపతిలో జరిగిన ఉన్నతస్థాయి సదస్సులో నీతి ఆయోగ్, NCAER, KPMG సంస్థలు కలిసి రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించే వ్యూహాలపై చర్చించాయి. AI ఆధారిత GVA అంచనాలు, GSDP నౌక్యాస్టింగ్ పైలట్ ప్రాజెక్టులు, అమరావతిలో సర్వీసెస్ ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు ఇందులో భాగంగా ఉన్నాయి.

తిరుమల నుంచి కుప్పం వరకు ప్రయోగాత్మక సంస్కరణలు

క్షేత్రస్థాయి సంస్థల్లోనూ పరిపాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు APSDPS చర్యలు చేపట్టింది. TTD, IIM అహ్మదాబాద్‌ల సహకారంతో తిరుమల శ్రీవారి సేవ కార్యక్రమంలో 2,500 మందికి పైగా రోజువారీ సేవకులకు శిక్షణ అందించేలా 12 మాడ్యూల్స్‌తో కూడిన పాఠ్యాంశాలను రూపొందించారు.

కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ–KADA పరిధిలో నిర్వహించిన అధ్యయనం ద్వారా పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 16,800కు పైగా ప్రజా సమస్యల్లో కేవలం 1.74 శాతం గ్రీవెన్స్ మాత్రమే తిరిగి తెరుచుకోవడం పరిష్కార వ్యవస్థ పనితీరుకు ఉదాహరణగా ప్రభుత్వం పేర్కొంటోంది.

అంతర్జాతీయ భాగస్వామ్యాలకు విస్తరణ

పట్టణ పాలన, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల్లో సింగపూర్‌తో ఒప్పందాల ద్వారా అంతర్జాతీయ అనుభవాలను రాష్ట్రంలో వినియోగించుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీతో కలిసి నీతి ఆయోగ్ స్టేట్ సపోర్ట్ మిషన్ కింద రాష్ట్ర స్థాయి ‘స్టేట్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్’గా పనిచేసేందుకు రూ.1.61 కోట్ల నిధులను సమీకరించింది.

విజన్‌ నుంచి వాస్తవ రూపంలోకి

డేటా ఆధారిత నిర్ణయాలు, రియల్‌టైమ్ పర్యవేక్షణ, ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, నియోజకవర్గ స్థాయి ప్రణాళికలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, జవాబుదారీతనం వంటి అంశాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా APSDPS రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులకు వేదికగా నిలుస్తోంది.

స్వర్ణాంధ్ర @2047 కేవలం ఒక విజన్ స్టేట్‌మెంట్‌గా కాకుండా.. ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా, ప్రతి ప్రభుత్వ శాఖ పనితీరును కొలిచే సూచికలతో కూడిన కార్యాచరణ ప్రణాళికగా మారుతోంది. డేటాను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలును నిరంతరం పర్యవేక్షించడం, ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తిరిగి పాలనలోకి తీసుకురావడం ద్వారా విజన్‌ను గ్రౌండ్ యాక్షన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోంది.

రానున్న రోజుల్లో ఈ వ్యవస్థ మరింత బలోపేతమైతే.. 2047 లక్ష్యాల దిశగా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలకు స్పష్టమైన కొలమానాలు, నిర్దిష్ట బాధ్యతలు, వేగవంతమైన అమలు వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంది. ఇదే డేటా ఆధారిత పరిపాలనను స్వర్ణాంధ్ర నిర్మాణానికి ప్రధాన చోదకశక్తిగా ప్రభుత్వం భావిస్తోంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story