Chandrababu Naidu: స్వచ్ఛాంధ్రతో రాష్ట్రంలో మార్పు కనిపిస్తోంది: సీఎం చంద్రబాబు!

Chandrababu Naidu: విజయవాడలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026’ స్వచ్ఛత ప్రజల ఉద్యమంగా మారాలని సీఎం చంద్రబాబు పిలుపు 22 విభాగాల్లో 2,174 పురస్కారాల ప్రదానం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 2 Oct 2026 9:52 PM IST
Chandrababu Naidu
X

Chandrababu Naidu: స్వచ్ఛాంధ్రతో రాష్ట్రంలో మార్పు కనిపిస్తోంది: సీఎం చంద్రబాబు!

Chandrababu Naidu: స్వచ్ఛత అనేది ప్రభుత్వం ఒక్కటే నిర్వహించాల్సిన కార్యక్రమం కాదని.. ఐదు కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత ఉద్యమంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గాంధీజీ స్వచ్ఛతకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డ్స్–2026 కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.

స్వచ్ఛతలో స్పష్టమైన మార్పు

రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తాను కూడా ప్రతి నెలా స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెప్పారు. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛత విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాయని తెలిపారు.

స్వచ్ఛత ఏ ఒక్క వర్గానికో, శాఖకో పరిమితమైన అంశం కాదని.. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీఎం సూచించారు. పాఠశాలలు, ఆస్పత్రులు, పార్కులు, రహదారులు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల్లో సామాజిక బాధ్యత పెరగాలని అన్నారు.

చెత్తను సంపదగా మార్చే విధానం

చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చే విధానాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చంద్రబాబు చెప్పారు. వ్యర్థాల నుంచి ఎరువులు, బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఘన వ్యర్థాల సేకరణ కోసం స్వచ్ఛ రథాలను నిర్వహిస్తున్నామని.. ఇ-ఆటోలు, పుష్ కార్టులు, మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కొత్తగా చెత్త పేరుకుపోకుండా ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నెట్‌జీరో దిశగా అడుగులు

రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో నెట్‌జీరో కాన్సెప్ట్‌తో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. నెట్‌జీరో లక్ష్యాల సాధనకు ఐఐటీ కాన్పూర్‌తో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అవగాహన ఒప్పందం చేసుకుందని చెప్పారు.

నగరాల్లో సిటీ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడంతో పాటు మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గోబర్ధన్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

నదుల్లోకి మురుగునీరు చేరకుండా చర్యలు

కృష్ణా, గోదావరి నదుల్లోకి వ్యర్థాలు, మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. దిగువ ప్రాంతాల్లో ప్రజలు నదుల నీటినే తాగునీటిగా వినియోగిస్తున్నారని గుర్తుచేశారు.

జల్‌జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి నీటిని అందించడంతో పాటు రాష్ట్రంలో మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా

గతంలో రాయలసీమలో కరువు పరిస్థితులు ఉండేవని.. సాగునీటి ప్రాజెక్టులు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటిని అందించగలిగామని సీఎం తెలిపారు. ఇప్పుడు సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

గ్లోబల్ హార్టీకల్చర్ హబ్ ద్వారా పచ్చదనం పెరగడంతో పాటు పర్యావరణంలో మార్పులు వస్తాయని తెలిపారు. తిరుమల కొండల్లో 80 శాతానికి పైగా పచ్చదనం ఉందని.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా పచ్చదనం పెరగాలని ఆకాంక్షించారు.

గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి

ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచడం ద్వారా హరిత విధానాలను మరింత విస్తరించాలని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది బాధ్యత తీసుకుని మొక్కలు నాటి హరిత ప్రదేశ్ సాధించాలని పిలుపునిచ్చారు.

వచ్చే ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళిక రూపొందించామని చంద్రబాబు తెలిపారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అభివృద్ధి, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

స్వచ్ఛ చల్లపల్లి స్ఫూర్తిగా

రాష్ట్రంలో స్వచ్ఛత కార్యక్రమాలకు స్వచ్ఛ చల్లపల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం సూచించారు. అక్కడ ప్రజల్లో వచ్చిన చైతన్యం అలవాటుగా మారి పరిసరాల్లో చెత్త వేయని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇదే తరహా స్వచ్ఛతా అలవాట్లు రాష్ట్రవ్యాప్తంగా రావాలని ఆకాంక్షించారు.

ప్రతి ఏడాది అక్టోబర్ 2న నెట్‌జీరో, స్వచ్ఛతపై పనిచేసిన వ్యక్తులు, సంస్థలకు అవార్డులు అందించే కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు.

22 విభాగాల్లో అవార్డులు

స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తిస్తూ 22 విభాగాల్లో 130 రాష్ట్రస్థాయి, 2,044 జిల్లా స్థాయి అవార్డులను అందిస్తున్నామని సీఎం తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, పరిశ్రమలతో పాటు పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లను కూడా గుర్తించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

దేశవ్యాప్తంగా 12 వేల మంది క్రీడాకారులు, రన్నర్లు స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు.

మున్సిపాలిటీలు, పంచాయతీలకు గుర్తింపు

స్వచ్ఛతలో ప్రతిభ కనబరిచిన తెనాలి, చిలకలూరిపేట, మంగళగిరి, పొన్నూరు, బొబ్బిలి, రాజాం, యలమంచిలి, పలమనేరు, గిద్దలూరు మున్సిపాలిటీలకు అవార్డులు అందించారు.

స్వచ్ఛ గ్రామ పంచాయతీ విభాగంలో కాకినాడ జిల్లా కే.మూలపేట, రావులపాలెం, పత్తికొండ, దుప్పాడ, నంబూరు, ఆర్ఎల్‌పురం తదితర పంచాయతీలకు అవార్డులు లభించాయి.

పాఠశాలలు, ఆస్పత్రులకు అవార్డులు

పాఠశాలల విభాగంలో నిడమర్రు జెడ్పీ హైస్కూల్, నెల్లూరులోని దేవిరెడ్డి శారదా హైస్కూల్, చంద్రంపాలెం జెడ్పీ హైస్కూల్‌కు అవార్డులు అందించారు.

ఆస్పత్రుల విభాగంలో పెందుర్తి, ఇబ్రహీంపట్నం, ఆస్పరి, కొనకనమిట్ల పీహెచ్‌సీలతో పాటు మంగళగిరి ఇందిరానగర్, తిరుపతి, చిన్నవాడ, విశాఖ యూపీహెచ్‌సీలకు గుర్తింపు లభించింది.

చిత్తూరు ప్రభుత్వ బాలుర హాస్టల్, కడప బీసీ బాలుర హాస్టల్, అనకాపల్లి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌తో పాటు పల్నాడు అంబేద్కర్ గురుకులం, ఏలూరు బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, బాపట్ల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలకు కూడా అవార్డులు అందించారు.

ఆలయాలు, బస్టాండ్లకు కూడా గుర్తింపు

విశాఖ ద్వారకానగర్ బస్టాండ్, చిత్తూరు ఎస్పీ కార్యాలయం, జీవీఎంసీ విశాఖ కార్యాలయానికి స్వచ్ఛతా అవార్డులు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలకు కూడా అవార్డులు లభించాయి.

హోటళ్ల విభాగంలో విశాఖ నోవోటెల్‌కు అవార్డు దక్కగా.. వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో అత్యుత్తమంగా పనిచేసిన స్టార్టప్‌కు కూడా స్వచ్ఛతా అవార్డును అందించారు.

ఇకపై ర్యాంకులు

ప్రతి పాఠశాల, పంచాయతీ, మున్సిపాలిటీకి స్వచ్ఛత ఆధారంగా ర్యాంకులు ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు తెలిపారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని మరింత మెరుగైన విధానాలను అమలు చేస్తామని చెప్పారు.

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.