AP: ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం: మంత్రి శ్రీనివాస్!

AP: ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాల 'స్వయం ఏపీ' బ్రాండ్ 65 ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్.

Hari Kishan  AP Bureau Chief
Published on: 5 Aug 2026 10:50 PM IST
AP
X

AP: ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త లక్ష్యం: మంత్రి శ్రీనివాస్!

AP: ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. "స్వయం ఏపీ" బ్రాండ్ కింద ఇప్పటికే రూపొందించిన 65 రకాల ఉత్పత్తులను విస్తృతంగా మార్కెటింగ్ చేయడంతో పాటు, ఎగుమతులకు అనువైన అవకాశాలను అన్వేషించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం విజయవాడలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

స్వయం ఏపీ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించాలని అధికారులకు మంత్రి సూచించారు. విదేశీ మార్కెట్లలో కూడా ఈ ఉత్పత్తులకు అవకాశాలు కల్పించేందుకు ఏపీఎన్ఆర్టీఎస్‌తో సమన్వయం చేసుకుని ఎగుమతుల అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకునే మార్గాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

మహిళల స్వయం ఉపాధిని మరింత విస్తరించేందుకు వినూత్న ఆలోచనలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. సౌరశక్తితో నడిచే మొబైల్ లాండ్రీ యూనిట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కింద సంస్థాగత వ్యాపారంగా ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త తరహా ఉపాధి అవకాశాలు సృష్టించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల మంది మహిళల ద్వారా వ్యాపార, సేవా, పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై కూడా సమావేశంలో సమీక్ష జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన "ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త" లక్ష్యానికి అనుగుణంగా కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తూ, గ్రామ పంచాయతీల పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి వాటిలో లైవ్‌లీహుడ్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

మహిళలు, యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించి, స్వయం ఉపాధి అవకాశాలను పెంచాలని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి అనుసంధానంగా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (NRLM) కింద రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPOలు) ద్వారా ఏర్పాటు చేసిన 163 కస్టమ్ హైరింగ్ సెంటర్ల పనితీరును కూడా మంత్రి సమీక్షించారు. రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.

సాంకేతికతను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ శాఖ రూపొందించిన డీపీఆర్ తయారీ యాప్‌ను స్త్రీ నిధి యాప్‌తో అనుసంధానించే అంశంపై కూడా చర్చించారు. దీంతో మహిళా సంఘాలకు వ్యాపార ప్రణాళికలు రూపొందించడం, సంస్థాగత రుణాలు పొందడం మరింత సులభతరం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

అదే సమయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాల విషయంలో పూర్తి అవగాహన కల్పించాలని మంత్రి ప్రత్యేకంగా ఆదేశించారు. యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, ఏపీ గ్రామీణ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు ఎస్‌హెచ్‌జీ క్యాష్ క్రెడిట్ లిమిట్ రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్, ఇన్‌స్పెక్షన్ ఛార్జీలను మినహాయిస్తున్న విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయాలని సూచించారు.

అర్హులైన ప్రతి స్వయం సహాయక సంఘం ఈ సదుపాయాలను పూర్తిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ చర్యలతో మహిళా సాధికారతకు, గ్రామీణ పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story