స్థానిక ఎన్నికలకు భయపడే వైసీపీ.. అభివృద్ధిని అడ్డుకునేందుకే కోర్టుల్లో పిటిషన్లు.. టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్..

Amaravati: స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే వైసీపీ వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మంగళగిరిలో మండిపడ్డారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 9 Oct 2026 11:07 PM IST
Amaravati
X

స్థానిక ఎన్నికలకు భయపడే వైసీపీ.. అభివృద్ధిని అడ్డుకునేందుకే కోర్టుల్లో పిటిషన్లు.. టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్..

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే వైఎస్సార్‌సీపీ రకరకాల సాకులతో ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజల్లో తమకు ఆదరణ ఉందని జగన్ భావిస్తే, బ్యాలెట్ విధానంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్‌), వార్డుల పునర్విభజన వంటి అంశాలను సాకులుగా చూపుతూ న్యాయస్థానాలను ఆశ్రయించడం ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నమేనని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు సకాలంలో జరిగితేనే కేంద్రం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.16,627 కోట్లు రాష్ట్రానికి అందే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలకు అడ్డంకులు సృష్టించడం వల్ల గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు, ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి

కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని రాజేష్ తెలిపారు. పల్లె పండుగ మొదటి రెండు విడతల ద్వారా సుమారు రూ.16,960 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఇందులో 7,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 8,300 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. రైతులు, పశుపోషకుల కోసం 37,817 మినీ గోకులాలు, పశువుల తాగునీటి కోసం 15,188 తొట్లు, రైతుల అవసరాల కోసం సుమారు 1.70 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించినట్లు వెల్లడించారు.

పల్లె పండుగ-3లో భాగంగా రూ.2,700 కోట్లతో 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, రూ.7,500 కోట్లతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. మరో 22 వేల మినీ గోకులాలు, ఉద్యాన పంటల విస్తరణకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అదనంగా రూ.110 కోట్లతో వెయ్యి కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

2019-24 మధ్య వైసీపీ పాలనలో పంచాయతీలను నిధుల కొరతలోకి నెట్టారని రాజేష్ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగం, పంచాయతీల ఖాతాల నుంచి నిధుల మళ్లింపు, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాల్లో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గ్రామ సచివాలయాల నిర్వహణ ఖర్చులను కూడా పంచాయతీలపై భారం మోపారని ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో పాటు గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో రూ.383 కోట్ల అంచనా వ్యయంతో 3,215 కిలోమీటర్ల రహదారుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటికే 1,974 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు.

గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పౌరసేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజేష్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఎన్నికలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించినా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.