Mangalagiri: చైర్మన్ మోషేన్ రాజు తీరుపై అశోక్ బాబు నిప్పులు

Mangalagiri: ఏపీ కౌన్సిల్ చైర్మన్ మోషేన్ రాజు నిర్ణయాలు ప్రజాస్వామ్య విరుద్ధమని టీడీపీ నేత పర్చూరి అశోక్ బాబు విమర్శించారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 April 2026 7:09 PM IST
Mangalagiri
X

Mangalagiri: చైర్మన్ మోషేన్ రాజు తీరుపై అశోక్ బాబు నిప్పులు

Mangalagiri: ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ మోషేన్ రాజు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీల రాజీనామాలను వెంటనే ఆమోదించాల్సిన చోట ఏడాది పాటు పెండింగ్‌లో ఉంచడం పూర్తిగా రాజకీయ దురుద్దేశమేనని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జయమంగళ వెంకటరమణ వంటి ఎమ్మెల్సీలు పార్టీ మారే ముందు నైతిక బాధ్యతతో తమ పదవులకు రాజీనామా చేశారని, అలాంటి రాజీనామాలను వెంటనే ఆమోదించాల్సిన బాధ్యత చైర్మన్‌పై ఉంటుందని అశోక్ బాబు అన్నారు. కానీ వాటిని ఆమోదించకుండా కాలయాపన చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. వెంకటరమణ స్వయంగా సభలో నిలబడి తన రాజీనామాను ఆమోదించమని కోరినా కూడా చైర్మన్ స్పందించకపోవడం ఆశ్చర్యకరమన్నారు.

హైకోర్టు సమాధానం ఇవ్వమని అడిగినా కౌంటర్ దాఖలు చేయకుండా ఉండటంతో కోర్టు చైర్మన్‌పై పెనాల్టీ విధించిందని, ఇది దేశ చరిత్రలోనే అరుదైన ఘటన అని ఆయన గుర్తు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ లేదా ఏ రాష్ట్ర అసెంబ్లీలోనూ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని చెప్పారు. చట్టసభ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి కోర్టుతో జరిమానా వేయించుకోవడం ఆ పదవికే అవమానమన్నారు.

రాజీనామా చేసిన వ్యక్తి కారణాలు ‘సహేతుకంగా లేవు’ అంటూ తిరస్కరించడం పూర్తిగా చట్టవిరుద్ధమని అశోక్ బాబు పేర్కొన్నారు. బిజినెస్ రూల్స్ ప్రకారం సభ్యుడు నిర్ణీత ఫార్మాట్‌లో రాజీనామా సమర్పిస్తే చైర్మన్‌కు దానిని ఆమోదించడం తప్ప మరో మార్గం ఉండదన్నారు. కారణాలు చెప్పాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. విచక్షణ అధికారం అంటే నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకోవడం మాత్రమేనని, ఇష్టానుసారంగా వ్యవహరించడం కాదన్నారు.

స్పీకర్ లేదా చైర్మన్ కుర్చీలో కూర్చున్న తర్వాత పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు. మాజీ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ, రబీ రే వంటి నాయకులు పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి పదవీ ధర్మాన్ని కాపాడారని ఉదాహరణలు చెప్పారు. పార్టీ కంటే రాజ్యాంగ బాధ్యతకు ప్రాధాన్యం ఇచ్చిన వారే చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

మోషేన్ రాజు కూడా అలాంటి మార్గాన్నే ఎంచుకోవాలని, లేకపోతే చరిత్రలో ‘కళంకిత చైర్మన్’గా మిగిలిపోతారని హెచ్చరించారు. పార్టీకి విధేయుడిగా ఉండటంలో తప్పులేదని, కానీ రాజ్యాంగ బాధ్యతను మరిచిపోవడం మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. పార్టీ కోసం పనిచేయాలనుకుంటే చైర్మన్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని, కానీ ఆ కుర్చీలో కూర్చుని చట్టాలను తుంగలో తొక్కడం సరికాదన్నారు.

2027 నాటికి మండలిలో సమీకరణాలు మారబోతున్నాయని అందరికీ తెలుసని, అలాంటి సమయంలో ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం అవసరం లేదన్నారు. చైర్మన్ ఇప్పటికైనా పునరాలోచించి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాలని పర్చూరి అశోక్ బాబు కోరారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story