అబద్ధాల అస్త్రంతో జగన్ రాజకీయాలు.. అభివృద్ధిని మళ్లించేందుకే ప్రెస్‌మీట్లు?

Amaravati: జగన్ ప్రెస్‌మీట్ల వెనుక అసలు ఉద్దేశం అభివృద్ధిని మళ్లించడమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 23 May 2026 5:34 PM IST
Amaravati
X

అబద్ధాల అస్త్రంతో జగన్ రాజకీయాలు.. అభివృద్ధిని మళ్లించేందుకే ప్రెస్‌మీట్లు?

Amaravati: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను మళ్లించేందుకే జగన్ మోహన్ రెడ్డి తరచూ ప్రెస్‌మీట్లు నిర్వహిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. అబద్ధాలు, అరాచకాలనే రాజకీయ పంథాగా ఎంచుకున్న జగన్ ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

*అభివృద్ధి వేగాన్ని చూసి అసహనం.. జగన్ డ్రామాల వెనుక ఇదేనా కారణం?*

గత మూడు నెలల్లో రాష్ట్రానికి క్యారియర్, రాయల్ ఎన్‌ఫీల్డ్, AMCA వంటి ప్రతిష్ఠాత్మక పెట్టుబడులు వచ్చాయని, SAEL సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పల్లా పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదలతో పాటు విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. అలాగే రాయలసీమలో రూ. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంటే దాన్ని తట్టుకోలేక జగన్ ప్రెస్‌మీట్ పేరిట అసత్య ప్రచారం చేస్తున్నారని, అనంతరం బెంగళూరుకు వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.

*ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం.. ప్రజలే ఇచ్చిన 11 సీట్ల తీర్పు*

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి శాశ్వత ప్రయోజనం చేకూరే ఒక్క పెద్ద అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని పల్లా విమర్శించారు. అయినా ఇప్పుడు తానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. అరాచకాలు, కక్షసాధింపులు, ఫ్యాక్షన్ ధోరణులు, శవ రాజకీయాలకు ప్రజలు ఇప్పటికే సమాధానం చెప్పారని, అందుకే వైఎస్సార్సీపీని కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి రాజకీయాలు, విధ్వంస రాజకీయాల మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తించారని చెప్పారు.

*బాబాయి హత్య కేసులో జగన్ వైఖరిలో మార్పు ఎందుకు?*

బాబాయి హత్య కేసులో జగన్ ప్రవర్తనపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని పల్లా వ్యాఖ్యానించారు. మొదట "గుండెపోటు" అని చెప్పింది ఎవరు? "నారాసుర రక్త చరిత్ర" అంటూ ప్రచారం చేసింది ఎవరు? సీబీఐ దర్యాప్తు కోరింది కూడా జగన్ కాదా? అని ప్రశ్నించారు.

ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో నిజాలు వెలుగులోకి తీసుకురాకపోవడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించిన ఆయన ఇప్పుడు అదే కేసును చంద్రబాబుతో ముడిపెట్టే ప్రయత్నాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

*శవ రాజకీయాలు.. ప్రజలు ఇక నమ్మే పరిస్థితి దాటిపోయింది*

శవ రాజకీయాలు వైఎస్సార్ కుటుంబ రాజకీయ చరిత్రలో భాగమయ్యాయని, ఇప్పుడు కూడా అదే పాత వ్యూహాన్ని కొనసాగించే ప్రయత్నం జరుగుతోందని పల్లా విమర్శించారు.

రాష్ట్రంలో అమలవుతున్నది "రాజారెడ్డి రాజ్యాంగం" కాదని, డాక్టర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమని స్పష్టం చేశారు. ప్రజలు ఇక ఫ్యూడల్ రాజకీయాలను అంగీకరించే పరిస్థితిలో లేరని, 2029 ఎన్నికల్లో జగన్‌కు శాశ్వత రాజకీయ విరామం ఇవ్వాలని నిర్ణయించుకుంటారని వ్యాఖ్యానించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story