ఇంటింటికీ టీడీపీ... 16 రోజుల్లో 47.50 లక్షల ఇళ్లు..ఎన్నికల ముంగిట ప్రజల తలుపు తడుతున్న కూటమి.. అభివృద్ధి, సంక్షేమాన్ని నేరుగా వివరించే ప్రయత్నం..
Amaravati: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా టీడీపీ ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం. 16 రోజుల్లో 47.50 లక్షల ఇళ్ల సందర్శన.
ఇంటింటికీ టీడీపీ... 16 రోజుల్లో 47.50 లక్షల ఇళ్లు..ఎన్నికల ముంగిట ప్రజల తలుపు తడుతున్న కూటమి.. అభివృద్ధి, సంక్షేమాన్ని నేరుగా వివరించే ప్రయత్నం..
అమరావతి: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం రోజురోజుకూ విస్తరిస్తోంది. సభలు, సమావేశాలు, ర్యాలీలకే పరిమితం కాకుండా.. నేరుగా ప్రజల ఇళ్ల గడప వద్దకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ కార్యక్రమం 16వ రోజుకు చేరుకుంది.
16 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 47.50 లక్షల ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. 16వ రోజు ఒక్కరోజే 3.25 లక్షల ఇళ్లను పార్టీ శ్రేణులు సందర్శించాయి. అంటే సగటున రోజుకు మూడు లక్షలకు పైగా కుటుంబాలతో పార్టీ నేతలు, కార్యకర్తలు మమేకమవుతున్నారనీ స్పష్టం చేస్తున్నారు కేంద్రం పార్టీ నేతలు...
గడపగడపకూ ప్రభుత్వ పాలన
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు.. ఆయా కుటుంబాల నుంచి నేరుగా అభిప్రాయాలను సేకరించడంపై టీడీపీ దృష్టి పెట్టింది. రైతు సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు తదితర అంశాలను ప్రతి కుటుంబానికి వివరించే ప్రయత్నం చేస్తోంది...గతంలో రాజకీయ పార్టీలు నిర్వహించిన ఇంటింటి ప్రచారాలతో పోలిస్తే.. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పనితీరుకు ఒక రకమైన పబ్లిక్ రిపోర్ట్ కార్డు గా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేస్తోంది? ప్రజలకు ఏం చేరింది? ఇంకా ఏం కావాలి? అనే అంశాలపై స్థానిక స్థాయిలో చర్చకు అవకాశం కల్పిస్తోంది.
47.50 లక్షల ఇళ్లు.. భారీ గా రాజకీయ సమీకరణలు..
16 రోజుల్లో 47.50 లక్షల ఇళ్లను సందర్శించడం అంటే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున రంగంలోకి దించినట్టే. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు...ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమం ఏ స్థాయిలో జరుగుతోంది? ఎన్ని ఇళ్లను సందర్శిస్తున్నారు? ప్రజల స్పందన ఎలా ఉంది? అనే అంశాలపై పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పనితీరును అంచనా వేసే అవకాశం కూడా టీడీపీ నాయకత్వానికి లభిస్తోంది.
లోకేష్ ఫోకస్.. ఎమ్మెల్యేలకు టాస్క్
కార్యక్రమంలో చురుగ్గా ముందుకు సాగుతున్న నియోజకవర్గాలపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలను అభినందిస్తూ.. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని సూచిస్తున్నారు...ఇది కేవలం పార్టీ కార్యక్రమంగా కాకుండా.. రాబోయే రోజుల్లో నాయకుల పనితీరును అంచనా వేసే ఒక ముఖ్యమైన క్షేత్రస్థాయి ప్రక్రియగా కూడా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రజలతో ఎవరు ఎక్కువగా మమేకమవుతున్నారు? ఎవరి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమం సమర్థంగా జరుగుతోంది? అనే అంశాలు నాయకత్వం దృష్టికి నేరుగా చేరుతున్నాయి.
ప్రజల స్పందనపై అసలు పరీక్ష
అయితే ఇంటింటి ప్రచారం విజయవంతం కావడం కేవలం ఎన్ని ఇళ్లను సందర్శించారనే లెక్కలతోనే తేలదు. ప్రజలు చెప్పే సమస్యలు, వారి అభిప్రాయాలు, ప్రభుత్వంపై ఉన్న సానుకూలతతో పాటు అసంతృప్తి అంశాలను పార్టీ శ్రేణులు ఎంతవరకు స్వీకరిస్తున్నాయన్నదే కీలకం...ప్రభుత్వం సాధించిన విజయాలను చెప్పడంతో పాటు.. ప్రజల సమస్యలను విని వాటిని పరిష్కార దిశగా తీసుకెళ్లగలిగితే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమానికి మరింత రాజకీయ ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం 16 రోజుల్లో 47.50 లక్షల ఇళ్ల సందర్శనతో దూకుడు చూపిస్తున్న టీడీపీ.. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా చూస్తే.. సభల నుంచి గడపల వరకు, ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ప్రజల అభిప్రాయాల వరకు.. కూటమి పాలనను నేరుగా ప్రజల ముందుంచే రాజకీయ కార్యాచరణగా ‘ఇంటింటికీ తెలుగుదేశం’ రూపుదిద్దుకుంటోంది.




