గురువులపై దాడుల నుంచి మద్యం స్కాం వరకు.. వైసీపీపై నాదెండ్ల మనోహర్ ఫైర్..

Amaravati: వైసీపీ అసాంఘిక శక్తులతో అశాంతి సృష్టిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం. మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విమర్శలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 Sept 2026 12:00 AM IST
Amaravati
X

గురువులపై దాడుల నుంచి మద్యం స్కాం వరకు.. వైసీపీపై నాదెండ్ల మనోహర్ ఫైర్..

అమరావతి: వైసీపీపై రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించడమే వైసీపీ రాజకీయ వ్యూహంగా కనిపిస్తోందని ఆరోపించారు. గురువారం తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాలుగైదు జిల్లాల నుంచి అసాంఘిక శక్తులను తీసుకొచ్చి నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడటం సరికాదన్నారు.

ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు అవకాశం ఉంటుందని.. అయితే పాఠాలు చెప్పే ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉండాలని, అభివృద్ధి జరగకూడదని, పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతో వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజల్లో అయోమయం, అభద్రత కొనసాగేలా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

గురువులంటే గౌరవం లేదంటూ విమర్శలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు గురువులంటే ఎప్పుడూ గౌరవం లేదని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. కోవిడ్ సమయంలో మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను అమ్మకాల కోసం వినియోగించిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. డీఎస్సీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చకు సిద్ధంగా ఉన్నామని పలుమార్లు చెప్పినా.. వైసీపీ నేతలు ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదన్నారు.

డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. డీఎస్సీపై జగన్ అడిగే ప్రతి ప్రశ్నకు ఆధారాలతో సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై శాసనసభలో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ వైసీపీ దాన్ని వినియోగించుకోవడం లేదని, ప్రజల్లో అయోమయం సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

మద్యం వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు

వైసీపీ హయాంలో జరిగిన మద్యం వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అప్పట్లో విక్రయించిన నాసిరకం మద్యం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.

వైసీపీ హయాంలో సుమారు రూ.1.30 లక్షల కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రూ.600 కోట్ల మేరకు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని మంత్రి ఆరోపించారు. ఈ వ్యవహారంలో అవినీతికి అవకాశం కల్పించారంటూ వైసీపీ నాయకత్వంపై విమర్శలు చేశారు.

మద్యం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈడీ దర్యాప్తు వేగం పెరిగేకొద్దీ దాన్ని తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ కొత్త నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. ప్రజలకు నిజానిజాలు తెలియకుండా రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు, అభివృద్ధి, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపే విధంగా ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు గమనిస్తున్నారని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.