Amaravati: ఎస్ఆర్ఎం వర్సిటీలో ఘనంగా అమరావతి సాహిత్య ఉత్సవాలు!

Amaravati: ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో మూడు రోజుల అమరావతి సాహిత్య ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంస్కృతి కమిషన్ చైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 7 Oct 2026 10:58 PM IST
Amaravati
X

Amaravati: ఎస్ఆర్ఎం వర్సిటీలో ఘనంగా అమరావతి సాహిత్య ఉత్సవాలు!

AP: తెలుగు భాష, సాహిత్యం విలువ వెలకట్టలేనిదని, మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దే శక్తి సాహిత్యానికి ఉందని ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ ఛైర్‌పర్సన్ తేజస్వి పొడపాటి అన్నారు. తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేసేందుకు అవసరమైన ప్రణాళికలతో సంస్కృతి కమిషన్ ముందుకు సాగుతోందని తెలిపారు.

ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బుధవారం మూడు రోజుల అమరావతి సాహిత్య ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి తేజస్వి పొడపాటి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, సాహిత్యాభిలాషులు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కవులు, రచయితలను ఉద్దేశించి ప్రసంగించారు. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సాహిత్య ఉత్సవాల వీడియోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా తేజస్వి పొడపాటి మాట్లాడుతూ డిజిటల్ యుగంలో నేటితరం విద్యార్థులు ‘అక్షరం’ విలువను విస్మరిస్తున్నారని అన్నారు. సాహిత్య మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే అక్షరాన్ని ఆరాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశీ భాషలపై ఆసక్తి పెంచుకోవడం మంచిదే అయినప్పటికీ మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. తెలుగు భాష, సాహిత్య విలువలను జాతీయ స్థాయిలో మరింత పెంపొందించే దిశగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

తెలుగు భాషా వికాసం, సాహిత్య విలువలను పెంచే దిశగా ఏపీ సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ పనిచేస్తోందని తేజస్వి పొడపాటి తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు పది మందికి పైగా ముఖ్యమంత్రులు హాజరుకానున్నారని చెప్పారు.

పుస్తక పఠనంతో ఆత్మవిశ్వాసం

విశిష్ట అతిథిగా పాల్గొన్న గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడంతో పాటు సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని అన్నారు. అమరావతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సాహిత్య ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

కవులు, రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యం

యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన కవులు, రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడమే అమరావతి సాహిత్య ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రెండు ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. పురస్కారాల ఎంపికను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రత్యేక జ్యూరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తమిళనాడుకు చెందిన ప్రముఖ రచయిత్రి మినీ కృష్ణన్ సాహిత్య ఉత్సవాల ప్రాధాన్యత, సమాజంపై సాహిత్యం చూపే ప్రభావం గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ విష్ణుపథ్, సాహిత్య ఉత్సవాల కన్వీనర్లు డాక్టర్ ఆర్గాబసు, డాక్టర్ శయంతన్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.

తరలివచ్చిన కవులు, రచయితలు

మూడు రోజుల పాటు జరిగే అమరావతి సాహిత్య ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా కవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు హాజరయ్యారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ భాషల్లోని పుస్తకాలను సందర్శకులు ఆసక్తిగా పరిశీలించడంతో పాటు రచయితలు, సాహితీవేత్తలతో పుస్తకాలు, సాహిత్య అంశాలపై చర్చించారు. సాహిత్యం, భాష, సంస్కృతికి వేదికగా అమరావతి సాహిత్య ఉత్సవాలు నిలిచాయి.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.