Amaravati: చిలకలూరిపేట ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత!

Amaravati: చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి. పల్నాడు అదనపు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, ప్రమాదంపై విచారణకు ఆదేశం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 27 Aug 2026 8:10 AM IST
Amaravati
X

Amaravati: చిలకలూరిపేట ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత!

Amaravati: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పల్నాడు అదనపు ఎస్పీకి హోంమంత్రి ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు.

అదనపు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన హోంమంత్రి.. ప్రమాదం జరిగిన తీరును, ప్రమాద తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలతో పాటు ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై అధికారులను ప్రశ్నించారు.

క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన వైద్య సేవలను అందించడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు హోంమంత్రి అనిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని హోంమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు. బస్సు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, వాహనం పరిస్థితి, రహదారి పరిస్థితులు తదితర అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సూచించారు. ప్రమాదానికి అసలు కారణాలను గుర్తించి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత అధికారులకు సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు డ్రైవర్ల పనితీరు, వాహనాల ఫిట్‌నెస్, వేగ నియంత్రణ వంటి అంశాలను నిరంతరం తనిఖీ చేయాలని ఆదేశించారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని హోంమంత్రి స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story