భారతీయ దేవాలయ పూర్వ వైభవానికి సరికొత్త వేదిక...సప్త సింధు
Amaravati: విజయవాడలో 'సప్త సింధు – ది అమరావతి ఎడిషన్ 2026' ఘన ప్రారంభం. భారతీయ దేవాలయ నిర్మాణ శైలి, వాస్తుశిల్పంపై యువ వాస్తుశిల్పులకు అవగాహన మరియు పోటీలు.
భారతీయ దేవాలయ పూర్వ వైభవానికి సరికొత్త వేదిక...సప్త సింధు
అమరావతి: వారసత్వాన్ని భావితరాలకు చేరవేసే మహోత్సవం భారతీయ నాగరికతకు దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కావు. అవి భారతీయ వాస్తుశిల్పం, శిల్పకళ, ఖగోళ శాస్త్రం, గణితశాస్త్రం, సంస్కృతి, సంప్రదాయాలకు చిరస్మరణీయ చిహ్నాలు. వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయ సంప్రదాయాన్ని భావితరాలకు చేరవేసేందుకు, యువతలో అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన విశిష్ట కార్యక్రమమే "సప్త సింధు – ది అమరావతి ఎడిషన్ 2026". భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విశ్వ బంధు ట్రస్ట్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్త సహకారంతో ఏఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రెండు రోజుల మహోత్సవం విజయవాడలో ప్రారంభమైంది.
*దేవాలయ నిర్మాణ కళకు ప్రాధాన్యం*
ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం భారతీయ దేవాలయ నిర్మాణ శైలి, సంప్రదాయాలను కేవలం ప్రదర్శించడం మాత్రమే కాదు... వాటి వెనుక ఉన్న శాస్త్రీయ ఆలోచన, సాంస్కృతిక విలువలు, సృజనాత్మకతను నేటి తరానికి పరిచయం చేయడం కూడా. దేవాలయాలు నిర్మాణ కళకు ఆదర్శమనే భావనను యువ వాస్తుశిల్పుల్లో నాటేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది.
దేశం నలుమూలల నుంచి విద్యార్థుల సందడి
టెంపుల్ డిజైన్, టెంపుల్ ఆర్చ్ డెకరేషన్, మ్యూరల్ ఆర్ట్, పల్లకీ తయారీ, రంగవల్లి వంటి విభాగాల్లో నిర్వహించిన పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. భారతీయ సంప్రదాయాలను ఆధునిక ఆలోచనలతో మేళవించిన వారి కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి...
*ప్రముఖుల సమక్షంలో ఘన ప్రారంభం*
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) ఈ మహోత్సవాన్ని ప్రారంభించారు. ఎస్పీఏ విజయవాడ డైరెక్టర్ డా. రమేష్ శ్రీకొండ, ఐజీఎన్సీఏ ప్రాంతీయ డైరెక్టర్ డా. కె.టి.వి. రాఘవన్, హెచ్ఎంటీవీ, ది హన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కె. హనుమంతరావు, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ప్రముఖ స్థపతి డీఎన్వీ ప్రసాద్, ఏఈ ఫౌండేషన్ డైరెక్టర్ సంగీతా మిశ్రా, యామిని, డా. యమునా పాఠక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
*ప్రాచీన భారతీయ శిల్పుల ప్రతిభకు గుర్తింపు*
స్వాగతోపన్యాసం చేసిన యామిని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలోనే భారతీయ శిల్పులు అద్భుతమైన దేవాలయాలను నిర్మించారని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి, మహానంది, శ్రీశైలం వంటి ఆలయాలు భారతీయ వాస్తుశిల్ప ప్రతిభకు శాశ్వత నిదర్శనాలని పేర్కొన్నారు. ఈ దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా ఇంజినీరింగ్ అద్భుతాలుగా కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని వివరించారు.
*దేవాలయాలు చరిత్ర ను తెలిపే సజీవ పాఠ్యపుస్తకాలు*
ఎస్పీఏ డైరెక్టర్ డా. రమేష్ శ్రీకొండ మాట్లాడుతూ, దేవాలయాలు భారతీయ నిర్మాణ శాస్త్రానికి జీవంతమైన పాఠ్యపుస్తకాల వంటివని అన్నారు. ప్రతి ఆలయం వెనుక శాస్త్రీయ ప్రణాళిక, దిశానిర్దేశం, ప్రకృతి అనుసరణ, నిర్మాణ సమతుల్యత వంటి అంశాలు దాగి ఉన్నాయని చెప్పారు. వాస్తుశిల్ప విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా చారిత్రక ఆలయాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలని సూచించారు.
*సృజనాత్మకతకు ఆలయాలే స్ఫూర్తి: సుజనా చౌదరి*
ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. శ్రీకాళహస్తి, లేపాక్షి, మదురై, సింహాచలం వంటి ఆలయాల నిర్మాణ శైలిని విద్యార్థులు లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. వాటిని యథాతథంగా అనుకరించడం కాకుండా, వాటి వెనుక ఉన్న ఆలోచనలను అర్థం చేసుకుని ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త నిర్మాణాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణాభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
*మీడియా పార్టనర్ గా HMTV, హాన్స్ ఇండియా*
హెచ్ఎంటీవీ, ది హన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కె. హనుమంతరావు మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే వినూత్న కార్యక్రమాలకు మీడియా ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొనడం భారతీయ వారసత్వంపై యువతలో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నాలకు మీడియా అండగా ఉంటుందని తెలిపారు.
*జ్ఞాన కేంద్రాలుగా భారతీయ దేవాలయాలు*
దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ మాట్లాడుతూ, దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావని, అవి జ్ఞానం, సంస్కృతి, సామాజిక జీవన విధానానికి కేంద్రబిందువులని వివరించారు. భారతదేశంలోని ప్రతి ప్రాంతం తనదైన ప్రత్యేక నిర్మాణ శైలిని అభివృద్ధి చేసుకుందని, అదే భారతీయ సంస్కృతికి ఉన్న వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు.
*శాస్త్రీయ నిర్మాణానికి వరాహమిహిరుడి మార్గదర్శనం*
ప్రముఖ స్థపతి డీఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం వంటి ఆలయాల నిర్మాణంలో శాస్త్రీయత, గణిత సూత్రాలు ఎలా ఉపయోగించారో వివరించారు. ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడి రచనల్లో పేర్కొన్న సూత్రాలే భారతీయ దేవాలయ నిర్మాణానికి బలమైన పునాదులని తెలిపారు. వేల ఏళ్ల క్రితమే భారతీయులు ప్రకృతి, దిశలు, సూర్యకాంతి, గాలి ప్రసరణను దృష్టిలో ఉంచుకుని ఆలయాలను నిర్మించారని చెప్పారు.
*సంస్కృతికి ప్రతీకగా సాంస్కృతిక ప్రదర్శనలు*
పంచమవేద డ్యాన్స్ స్కూల్ విద్యార్థుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది. భారతీయ నృత్య సంప్రదాయాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భారతీయ కళలు, వాస్తుశిల్పం, సంస్కృతి పరిరక్షణకు విశేష సేవలందించిన ప్రముఖులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
*వారసత్వ పరిరక్షణకు యువతే భవిష్యత్తు*
భారతీయ దేవాలయాలు ప్రపంచ వారసత్వ సంపదలో అత్యంత విలువైన భాగం. వాటి నిర్మాణ వైభవం, శాస్త్రీయత, సాంస్కృతిక ప్రాముఖ్యతను యువతకు చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహించిన "సప్త సింధు – ది అమరావతి ఎడిషన్ 2026" కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే కాదు... భారతీయ వారసత్వ పరిరక్షణకు, సృజనాత్మక భావితరాల నిర్మాణానికి దిశానిర్దేశం చేసిన ఒక విలువైన వేదికగా నిలిచింది.




