యోగాంధ్ర-2026కు శ్రీకారం.. ప్రజారోగ్య ఉద్యమంగా యోగాను తీర్చిదిద్దే దిశగా
YogaAndhra 2026: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2026’ వివరాలు ఇవే. జూన్ 7 నుంచి 20 వరకు యోగా కార్యక్రమాలు.
యోగాంధ్ర-2026కు శ్రీకారం.. ప్రజారోగ్య ఉద్యమంగా యోగాను తీర్చిదిద్దే దిశగా
YogaAndhra 2026: ఏపీ ప్రభుత్వం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాంధ్ర-2026 కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని అన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధనగా యోగాను అభివర్ణించారు. యోగాను ప్రతి వ్యక్తి జీవనశైలిలో భాగం చేయాలనే సంకల్పంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు...
*కోటి మందిని భాగస్వామ్యం చేయడమే లక్ష్యం*
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర-2026ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈసారి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి "యోగ ఫర్ హెల్తీ ఏజింగ్" అనే థీమ్‌ను నిర్ణయించారని, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు...
*ఒక్కరోజు కాదు... నిత్యజీవితంలో భాగం కావాలి*
యోగాను కేవలం ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమంగా కాకుండా ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి నిత్యజీవితంలో భాగంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో యోగా కీలక పాత్ర పోషించాలని, స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా దీనిని ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. గత ఏడాది సాధించిన విజయాలను కొనసాగిస్తూ ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు...
*14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర*
జూన్ 7 నుంచి జూన్ 20 వరకు మొత్తం 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అమరావతిలో కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25 వేల మందితో భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక థీమ్‌ను నిర్ణయించామని, ఎన్‌టీఆర్ జిల్లాలో పోలీసు సిబ్బందితో, కోనసీమ జిల్లాలో రైతులతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో 2 వేల నుంచి 3 వేల మంది పాల్గొనేలా భారీ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు
రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించి యోగా టూరిజాన్ని ప్రోత్సహించనున్నట్లు సీఎం వివరించారు. ఉండవల్లి గుహలు, శ్రీశైలం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న ప్రాంతాలను ఈ కార్యక్రమాలకు వేదికలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దీంతో యోగాతో పాటు రాష్ట్ర పర్యాటక రంగానికీ కొత్త ఊపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు...
*10 లక్షల మంది యోగా సాధకుల తయారీ లక్ష్యం*
యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగాపై మరింత ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో 10 లక్షల మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రస్తుతం ఉన్న యోగా ట్రైనర్ల సంఖ్యను 2.5 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు. యోగాంధ్ర-2026 విజయవంతం కోసం రూ.10 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించినట్లు వెల్లడించారు...
*365 రోజుల ఉద్యమంగా యోగా*
యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా ఏడాది పొడవునా కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక కోటి మంది క్రమం తప్పకుండా యోగా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా నిరంతర శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. జూన్ నెల మొత్తాన్ని "యోగా నెల"గా ప్రకటించినట్లు వెల్లడించారు...
*మంతెన వీడియోలతో ఇంటింటికీ యోగా*
ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు సహకారం తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ప్రతి ఇంటికి యోగా చేరేలా ప్రత్యేక వీడియోలను రూపొందించారని చెప్పారు. సాధారణ యోగా ఆసనాలు, వ్యాధి నివారణ పద్ధతులు, రోజువారీ సాధన, యోగాకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై 168కు పైగా వీడియోలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు...
*ఒక్క ‘Hi’తో యోగా వీడియోలు*
వాట్సాప్ నంబర్ 81424 04888కు "Hi" అని మెసేజ్ పంపితే యోగా వీడియోలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ ఛానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
*యోగాంధ్ర పోర్టల్ ప్రారంభం*
స్కూళ్లు, కాలేజీల్లో యోగాను విద్యా కార్యక్రమాల్లో భాగం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చిన్న వయస్సు నుంచే యోగా అలవాటు చేయగలిగితే ఆరోగ్యవంతమైన తరాన్ని తీర్చిదిద్దవచ్చని అన్నారు. యోగాంధ్ర-2026 కోసం ప్రత్యేకంగా యోగాంధ్ర పోర్టల్‌ను ప్రారంభించామని, కార్యక్రమాల వివరాలు, వీడియోలు, నమోదు ప్రక్రియ తదితర సమాచారం అందులో లభిస్తుందని చెప్పారు.
yogandhra.ap.gov.in
*ప్రముఖ యోగా సంస్థల భాగస్వామ్యం*
మహిళలు, విద్యార్థుల్లో యోగాపై మరింత అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టుతో ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇషా ఫౌండేషన్, సద్గురు జగ్గీ వాసుదేవ్, బ్రహ్మకుమారీస్, దాజీ, బాబా రామ్‌దేవ్ వంటి ప్రముఖుల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు...
*గతేడాది రికార్డులు... ఈసారి మరింత భారీ లక్ష్యాలు*
గత ఏడాది నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని సీఎం గుర్తుచేశారు. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన యోగాంధ్ర ద్వారా రెండు గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు, ఒక స్కోచ్ అవార్డు రాష్ట్రానికి లభించాయని చెప్పారు. 2.44 కోట్ల మంది నమోదు చేసుకోగా, 1.91 కోట్ల మందికి సర్టిఫికెట్లు అందించామని తెలిపారు. 1.33 లక్షల వేదికలపై 1.53 లక్షల మంది ట్రైనర్లతో కార్యక్రమాలు నిర్వహించామని, ప్రస్తుతం 2.18 కోట్ల మంది వెల్‌నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా చేస్తున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు.




