Anantapur: కళ్యాణదుర్గంలో విద్యార్థుల ఉధృత నిరసన..

Anantapur: ఎస్సీ, బీసీ హాస్టళ్లను వెంటనే పునఃప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Anantapur
X

Anantapur: కళ్యాణదుర్గంలో విద్యార్థుల ఉధృత నిరసన..

అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం పట్టణంలో మూతపడిన ఎస్సీ, బీసీ హాస్టళ్లను వెంటనే పునఃప్రారంభించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఎదుట విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు మాట్లాడుతూ, కంబదూరు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో ఉన్న ఎస్సీ, బీసీ హాస్టళ్లు దాదాపు పదేళ్లుగా మూతపడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి హాస్టల్ భవనాల మరమ్మతులకు నిధులు కేటాయించి వాటిని తిరిగి ప్రారంభించాలని కోరారు.

హాస్టళ్లు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాలకు చెందిన వందలాది మంది పేద విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు అందిస్తున్న మెస్ మరియు కాస్మోటిక్ చార్జీలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సరిపోవడం లేదని పేర్కొన్నారు.

జైళ్లలో ఖైదీల ఆహారం కోసం రోజుకు వంద రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, హాస్టల్ విద్యార్థులకు మాత్రం కేవలం రూ.53 మాత్రమే కేటాయించడం బాధాకరమని విమర్శించారు.జిల్లాలో అనేక ఎస్సీ, బీసీ హాస్టళ్లు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, అక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, స్నానాల గదులు వంటి మౌలిక వసతులను తక్షణమే కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్థుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, లేకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంఘం నాయకులు పవన్, జగదీష్, రమేష్, రాందాస్, మను, రఘు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story