Guntakal: గుంతకల్లు మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం జోరు!

Guntakal: గుంతకల్లు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి. చైర్మన్ అభ్యర్థి యశోద గౌడ్, కౌన్సిలర్ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం. పట్టణాభివృద్ధికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 30 Oct 2026 7:24 AM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లు మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం జోరు!

Guntakal: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కూటమి చైర్మన్ అభ్యర్థి యశోద గౌడ్, ఆమె కుటుంబ సభ్యులు, ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వీధివీధినా తిరుగుతూ ఓటర్లను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా గుంతకల్లు పట్టణంలో గౌడ కుటుంబం గతంలో చేసిన సేవలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేస్తూ తమకు ఒక అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. యశోద గౌడ్‌ను చైర్మన్‌గా గెలిపించి మున్సిపల్ పీఠంపై కూర్చోబెడితే పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు.

ముఖ్యంగా పట్టణంలోని ప్రతి వార్డులో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ప్రజలకు వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సహకారంతో గుంతకల్లు మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని పేర్కొంటున్నారు.

కుటుంబ సభ్యులు, కౌన్సిలర్ అభ్యర్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రచారంలో పాల్గొంటుండటంతో పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని యశోద గౌడ్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL