Anantapur: అనంతపురంలో ఎండల ఉధృతి.. కన్నీరు పెడుతున్న రైతులు
Anantapur: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
Anantapur: అనంతపురంలో ఎండల ఉధృతి.. కన్నీరు పెడుతున్న రైతులు
Anantapur: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాలలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే మంచి వర్షాలు పడతాయని ఆశతో రైతులు పత్తి, కంది, వేరుశెనగ పంటలు సాగు చేశారు. భూములు దున్ని, విత్తనాలు, ఎరువుల కోసం లక్షలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు.
కానీ విత్తనాలు వేసిన తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఎండల కారణంగా పంటలు మొలక దశలోనే ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది.
వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతులకు ఈ పరిస్థితి తీవ్ర మనోవేదన కలిగిస్తోంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు భారీగా పెరగడంతో సాగు వ్యయం అధికమైంది. మళ్లీ విత్తనాలు వేయాలంటే మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ ఉదయం, సాయంత్రం ఆకాశం వైపు చూస్తూ వాన కోసం ఎదురుచూస్తున్నామని, చేతుల్లో ఏమీ లేక నిస్సహాయంగా ఉన్నామని రైతులు వాపోతున్నారు.
కొన్ని ప్రాంతాల్లో పత్తి మొక్కలు సరిగా ఎదగకపోవడంతో పురుగు పడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. కంది, వేరుశెనగ పంటల్లోనూ తేమ లేక పెరుగుదల మందగించింది. మరికొన్ని రోజుల్లో వర్షాలు కురవకపోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కురిస్తే కొంతమేర కోలుకునే అవకాశం ఉన్నా, ఆలస్యమైతే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వర్షాభావంతో నష్టపోయిన రైతులకు తగిన సహాయం, పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.




