Anantapur: 4 గంటల్లోనే వృద్ధురాలి హత్య కేసు ఛేదన నిందితుడు అరెస్ట్
Anantapur: అనంతపురంలో వృద్ధురాలి హత్య కేసును 4 గంటల్లో పోలీసులు ఛేదించారు. బంగారు కమ్మల కోసం మనవడే హత్య చేసినట్లు డీఎస్పీ కరుణాకర్ రావు వెల్లడించారు.
Anantapur: 4 గంటల్లోనే వృద్ధురాలి హత్య కేసు ఛేదన నిందితుడు అరెస్ట్
అనంతపూర్: అనంతపురం కోవూరు నగర్ వృద్ధురాలి హత్య కేసును పోలీసులు నాలుగు గంటల్లోనే ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టౌన్ డీఎస్పీ కరుణాకర్ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. డబ్బుల కోసం వరుసకు మనవడు అయిన నారాయణస్వామి వృద్ధురాలు చిన్న నాగమ్మను హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు.
కోవూరు నగర్‌లో లక్ష్మీనారాయణ ఇంట్లో చిన్న నాగమ్మతో పాటు మొత్తం ఏడుగురు నివాసం ఉంటున్నారని తెలిపారు. నిందితుడు నారాయణస్వామి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ, మద్యానికి బానిసగా మారాడని చెప్పారు.
డబ్బుల కోసం వృద్ధురాలి బంగారు కమ్మలు ఇవ్వాలని నారాయణస్వామి గొడవపడ్డాడని, ఆమె కమ్మలు ఇవ్వకపోవడంతో పక్కనే ఉన్న రోకలిబండతో తలపై కొట్టి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అనంతరం ఆమె చెవుల నుంచి బంగారు కమ్మలు తీసుకెళ్లినట్లు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రోకలిబండతో పాటు కట్టర్ బ్లేడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ తెలిపారు.
నారాయణస్వామిపై కేసు నమోదు చేశామని, రేపు ఉదయం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ కరుణాకర్ రావు వెల్లడించారు.




