Anantapur: అనంతపురంలో వాన బీభత్సం.. గంట వర్షానికే చెరువులైన లోతట్టు ప్రాంతాలు!

Anantapur: అనంతపురం నగరంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటపాటు కురిసిన వానకు రోడ్లు జలమయమవ్వగా, చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడి జనజీవనం స్తంభించింది.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 30 May 2026 9:01 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో వాన బీభత్సం.. గంట వర్షానికే చెరువులైన లోతట్టు ప్రాంతాలు!

అనంతపురం: అనంతపురం నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగర ప్రజలకు వరుణుడు కాస్త ఉపశమనాన్ని ప్రసాదించాడు. అయితే, ఉరుములు, మెరుపులతో కూడిన ఈ భారీ వర్షం నగరంలో పెద్ద ఎత్తున అలజడిని సృష్టించింది.

దాదాపు గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లోని రోడ్లపై కూడా మురుగునీరు, వర్షపు నీరు చేరి జలమయమయ్యాయి.

నగరంలో భారీ నష్టం స్తంభించిన జీవనం

విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఈదురు గాలుల ధాటికి నగరంలోని పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అన్ని కాలనీల్లో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని దశాబ్దాలుగా రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఒక్కసారిగా వేళ్లతో సహా పెకలించుకుని రోడ్లపై విరిగిపడ్డాయి. దీనివల్ల నగరంలోని ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి పెద్ద ఎత్తున మురుగునీరు వచ్చి చేరింది. ఫలితంగా నగరమంతా తీవ్ర దుర్వాసన చుట్టుముట్టింది. ఈ మురుగునీటిలోనే కాలినడకన, వాహనాలపై వెళ్లాల్సి రావడంతో ప్రజలు నరకయాతన అనుభవించారు.

"నగరంలోని మురుగు కాలువలను (డ్రైనేజీలను) మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. వర్షం పడిన ప్రతిసారీ ఇదే తంతు అవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.

స్థానిక ప్రజల ఆవేదన

ఎండల నుండి ఉపశమనం లభించిన ఆనందం ఉన్నప్పటికీ, నగర మౌలిక వసతుల లోపం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి విరిగిపడిన చెట్లను, కరెంటు స్తంభాలను తొలగించి, నగరంలో యథాస్థితిని పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story