Anantapur: అనాథలు, వృద్ధుల మధ్య దీపావళి వెలుగులు నింపిన అనంతపురం పోలీసులు

Anantapur: అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో ఆశ్రమవాసులతో కలిసి దీపావళి వేడుకలు జరిపిన పోలీసులు. స్వీట్ల పంపిణీ, బాణాసంచా కాల్చి సహపంక్తి భోజనం.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 8 Nov 2026 11:07 PM IST
Anantapur
X

Anantapur: అనాథలు, వృద్ధుల మధ్య దీపావళి వెలుగులు నింపిన అనంతపురం పోలీసులు

అనంతపూర్: దీపావళి అంటేనే దీపాల వెలుగులు.. ఆనందోత్సాహాలు.. కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే వేడుక. అయితే కుటుంబాలకు దూరంగా ఆశ్రమాల్లో జీవిస్తున్న అనాథలు, వృద్ధులు, అంధుల జీవితాల్లోనూ పండుగ వెలుగులు నింపాలనే మంచి ఆలోచనతో ముందుకొచ్చారు అనంతపురం జిల్లా పోలీసులు.జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కేవలం తమ కుటుంబాలతోనే కాకుండా.. కుటుంబ ఆదరణకు దూరంగా ఉన్న వారితోనూ దీపావళి వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించారు.జిల్లా వ్యాప్తంగా కింది స్థాయి పోలీసు సిబ్బంది నుంచి ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు, ఏఎస్పీ అశ్విన్ మణిదీప్ ఐపీఎస్ వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.వివిధ ప్రాంతాల్లోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, అంధుల ఆశ్రమాలకు వెళ్లిన పోలీసు అధికారులు అక్కడి వారితో ఆత్మీయంగా మమేకమయ్యారు.

ఆశ్రమవాసులకు స్వీట్లు పంపిణీ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి బాణాసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు.అంతేకాకుండా ఆశ్రమవాసుల కోసం ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లు చేసి..పోలీసు అధికారులు, సిబ్బంది వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తమ మధ్యకు వచ్చి ఆప్యాయంగా పలకరించి, తమతో కలిసి పండుగ జరుపుకున్న పోలీసులను చూసి ఆశ్రమవాసులు ఆనందం వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వారికి పోలీసుల రాకతో ఆశ్రమాల్లో పండుగ వాతావరణం నెలకొంది. తమకూ ఒక కుటుంబం ఉందనే ఆత్మీయ భావనను కల్పిస్తూ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు.పోలీసుల విధి కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాదని..సమాజంలోని ప్రతి ఒక్కరికీ అండగా నిలవడం, ఆపదలో ఉన్నవారికి భరోసా కల్పించడం కూడా తమ బాధ్యతేనని ఈ కార్యక్రమం ద్వారా అనంతపురం జిల్లా పోలీసులు నిరూపించారు.మొత్తానికి.. విధి నిర్వహణలోనే కాదు.. మానవత్వం చాటడంలోనూ తాము ముందుంటామని నిరూపిస్తూ, ఆశ్రమవాసుల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపారు అనంతపురం జిల్లా పోలీసులు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM