Anantapur: హార్టికల్చర్ హబ్ పేరుతో మోసం - శైలజానాథ్ ధ్వజం

Anantapur: అనంతపురంలో మాజీ మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ హార్టికల్చర్ హబ్ పేరుతో కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 2 Oct 2026 9:26 PM IST
Anantapur
X

Anantapur: హార్టికల్చర్ హబ్ పేరుతో మోసం - శైలజానాథ్ ధ్వజం

అనంతపూర్: అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాయలసీమలో నీటి కొరతతో పంటలు ఎండిపోతుంటే హార్టికల్చర్ హబ్ పేరుతో సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. లక్ష కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు.రాయలసీమలో భూగర్భ జలాలు పెరిగాయని చంద్రబాబు చెబుతున్న మాటలు వాస్తవ విరుద్ధమని శైలజానాథ్ అన్నారు.

2025లో 7.96 మీటర్లుగా ఉన్న భూగర్భ నీటిమట్టం ప్రస్తుతం 11.14 మీటర్ల లోతుకు పడిపోయిందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో నీరు లేక వేల ఎకరాల మామిడి తోటలు ఎండిపోతున్నాయని, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో చీనీ తోటలను కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్లతో నీటిని పోయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.హార్టికల్చర్ హబ్ పేరుతో రైతుల భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

రైతులను వారి సొంత పొలాల్లోనే కూలీలుగా మార్చే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.టమాటా, చీనీ, ఉల్లి, మిర్చి వంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని శైలజానాథ్ విమర్శించారు.గతంలో కోటి 18 లక్షల మంది రైతులకు బీమా వర్తిస్తే.. ప్రస్తుతం 40 లక్షల మందికే పరిమితం చేశారని ఆరోపించారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం కంటితుడుపు చర్యలకే పరిమితమైందని అన్నారు.అన్నమయ్య జిల్లాలో 78 శాతం, సత్యసాయి జిల్లాలో 64 శాతం వర్షపాతం లోటు ఉందని పేర్కొన్నారు. కరువు తీవ్రంగా ఉన్నప్పటికీ 388 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారని విమర్శించారు.రాయలసీమకు నీరు అందించే ప్రాజెక్టుల విషయంలోనూ కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని శైలజానాథ్ ఆరోపించారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేశారని విమర్శించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు ఉన్నప్పటికీ సీమ ప్రాజెక్టులను నింపడం లేదని అన్నారు.

రాయలసీమకు దక్కాల్సిన పలు కేంద్ర సంస్థలను అమరావతికి తరలించారని శైలజానాథ్ ఆరోపించారు. సీమ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.రాయలసీమ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM