Anantapur: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనంతపురం ఎస్పీ సమీక్ష!

Anantapur: అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ , పలు మార్గదర్శకాలు జారీ చేసిన ఎస్పీ.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 8 Oct 2026 7:06 AM IST
Anantapur
X

Anantapur: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనంతపురం ఎస్పీ సమీక్ష!

Anantapur: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు.రేపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సమావేశం నిర్వహించనున్న తరుణంలో ఎస్పీ బుధవారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించి, అధికారులకు పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో అనవసర ఘర్షణలు, వర్గ విభేదాలు, చిన్నపాటి వివాదాలు పెద్దవి కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, నేరమే జరగకుండా నివారించడమే పోలీసుల ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు.సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

పల్లె నిద్రతో ప్రజలకు చేరువగా.. గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితిని అంచనా వేసేందుకు అధికారులు 'పల్లె నిద్ర' కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రాత్రి బస చేయాలి.ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా గొడవలను ప్రాథమిక దశలోనే నివారించవచ్చు.ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి.

రేపటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాన్ఫరెన్స్ మార్గదర్శకాలను ప్రాతిపదికగా తీసుకుని జిల్లాలో పక్కా ప్రణాళికను అమలు చేస్తామన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడేది లేదని, స్థానిక పోరును ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉందని అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ వెల్లడించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM