Anantapur: అనంతపురం 19న వైసీపీ ఆధ్వర్యంలో సాగునీటి యాత్ర
Anantapur: సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై వైసీపీ ఆందోళన. ఈ నెల 19న చోళసముద్రం నుంచి హంద్రీనీవా కాలువ వరకు క్షేత్రస్థాయి పరిశీలన యాత్ర చేపట్టనున్న వైసీపీ నేతలు.
Anantapur: అనంతపురం 19న వైసీపీ ఆధ్వర్యంలో సాగునీటి యాత్ర
అనంతపూర్: "రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల రక్షణే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19వ తేదీన వైసీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో భారీ యాత్ర చేపట్టనున్నట్లు అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ప్రకటించారు." అనంతపురం జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కీలక సమావేశం జరిగింది.
జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు సింగనమల నియోజకవర్గ ఇన్‌చార్జ్ శైలజానాథ్, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని నాయకులు మండిపడ్డారు.
కాలువలను వెడల్పు చేయకుండా కేవలం లైనింగ్ పనులు మాత్రమే చేయడం వల్ల రైతులకు సాగునీరు అందడం లేదని ధ్వజమెత్తారు. దీనివల్ల పంటలు ఎండిపోవడమే కాకుండా, భూగర్భ జలాలు అడుగంటి బోర్లు కూడా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తీవ్ర నీటి ఎద్దడి కారణంగా జిల్లా వ్యాప్తంగా రైతాంగం అల్లాడిపోతోందని వైసీపీ నాయకులు ఆరోపించారు.రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు, ఈ నెల 19న చోళసముద్రం నుంచి హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల వరకు వైసీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన యాత్ర సాగనుంది.
గతంలో రైతులకు అందిన లబ్ధి ఏమిటి ప్రస్తుత లైనింగ్ పనుల వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అనే అంశాలను రాజకీయాలకు అతీతంగా, స్వయంగా రైతులతో కలిసి పరిశీలిస్తామని అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో సేకరించిన పూర్తి వివరాలు, రైతుల సమస్యలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు నాయకులు వెల్లడించారు.




